Publish Date: Thu, 16 Oct 2014 (11:28 IST)
Updated Date: Thu, 16 Oct 2014 (11:35 IST)
తమిళనాడు మాజీ సీఎం జయలలిత జైలుకెళ్లడంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ కేవలం డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే ప్రధాన పోటీ ఉండేది. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గండికొట్టాలని కొత్త పార్టీలతో పాటు కేంద్రంలోని ఎన్డీయే కూడా రెడీ అవుతోంది. ఇందులో భాగంగా 2019 ఎన్నికల్లో రజనీకాంత్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దించాలనుకున్న బీజేపీ.. మరో ఇద్దరిపైనా దృష్టిసారించింది.
ఈ క్రమంలో రజనీ-విజయ్‌కాంత్-విజయ్ ఈ ముగ్గురు త్రయాన్ని భాజపా గూటికి చేర్చాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైళ్లో ఉండడంతో ఈ అవకాశాన్ని చక్కగా అంది పుచ్చుకుని వచ్చే ఎన్నికల నాటికి తమిళనాడులో పాగా వేయాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ తమ వ్యూహాలకు పదును పెడుతోంది.
ఇప్పటి వరకు రజనీ మంత్రాన్ని పఠించిన కమలనాథులు ఇప్పుడు రజనీకి తోడుగా విజయ్, విజయ్‌కాంత్‌లకు కూడా వలవేసి పార్టీని బలోపేతం చేయనున్నారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగియడంతో అక్కడ ఆపరేషన్‌ను పూర్తి చేసిన మోడీ సన్నిహితుడు అమిత్‌షాకు ఇప్పుడు తమిళనాడు బాధ్యతలు అప్పగించనున్నట్టు సమాచారం.
ఇళయదళపతి విజయ్‌కు తమిళనాట యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. విజయ్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు మద్దతు పలికారు. తర్వాత ఆయన కత్తి సినిమా గురించి వివాదాలు చెలరేగినా అక్కడ ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.
అయితే మొన్న లోక్‌సభ ఎన్నికలకు ముందు కోయంబత్తూరులో ప్రధానమంత్రి మోడీ విజయ్‌తో భేటీ అవ్వడంతో విజయ్ క్రేజ్ ఒక్కసారిగా పతాకస్థాయికి చేరుకుంది. విజయ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న మక్కల్ ఇయ్యంకు మద్దతు కూడగట్టుకునేలా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సూచనలతో కొందరు రంగంలోకి దిగారు.
అలాగే తమిళనాడులో విజయ్‌కాంత్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు. విజయ్‌కాంత్‌కు కెప్టెన్ టీవీ, న్యూస్ ఛానెళ్లు ఉన్నాయి. పదేళ్లుగా ఒంటరిగా పార్టీని ముందుకు తీసుకెళుతున్న ఆయనకు చెందిన న్యూస్‌ఛానెళ్లు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు తెలిసింది. విజయ్‌కాంత్‌కు పూర్తి ఆర్థిక సహకారాలు ఇస్తూ ఆయన్ను తమ నుంచి తప్పుకోకుండా చూసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
ఈ క్రమంలో రజనీకాంత్‌కు సీఎం సీటు ఆఫర్, విజయ్‌కాంత్‌ను ఎప్పటకీ తమ మిత్రుడుగానే ఉంచుకునేలా, విజయ్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రచిస్తున్న వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.
Selvi
Publish Date: Thu, 16 Oct 2014 (11:28 IST)
Updated Date: Thu, 16 Oct 2014 (11:35 IST)