Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన ఆటలో అరటిపండు కావడంతో ఏపీలో భాజపా మునిగింది...

Advertiesment
జనసేన ఆటలో అరటిపండు కావడంతో ఏపీలో భాజపా మునిగింది...
, బుధవారం, 31 జులై 2019 (15:49 IST)
రాజకీయ అనిశ్చితి తలెత్తితే ఇతర పార్టీలు ఆటాడుకోవడం మామూలే. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కొన్నిచోట్ల అధికారాన్ని దక్కించుకోడానికి ఇదే పద్ధతి ఉపయోగిస్తుంది. తాజాగా కర్నాటకలో జరిగింది ఇదే. కాంగ్రెస్, జేడీఎస్ కాపురాన్ని చిన్నాభిన్నం చేసేసి, అసమ్మతిని ఎగదోసి కూటమిని కూలదోసి, చివరకు బీజేపీ గద్దెనెక్కింది. 
 
స్పీకర్ రమేష్ కుమార్ ఎమ్మెల్యేలపై వేటు వేసి అందరిచేత శెహభాష్ అనిపించుకోవడం వెనక కూడా బీజేపీ హస్తం ఉందనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.
 
గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఇదే జరిగింది. పూర్తి మెజార్టీతో అక్కడ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టి చివరకు బీజేపీ అక్కడ పాగా వేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం చివరికి సీఎం సహా పార్టీ ఫిరాయించడం చరిత్రలో అదే మొదటిసారి. 
 
తమిళనాడులో జయలలిత మరణం తర్వాత బీజేపీ పాగా వేయాలని చూసినా కుదర్లేదు. లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ ఆధ్వర్యంలోని డీఎంకే క్లీన్ స్వీప్ చేయడంతో బీజేపీ దూకుడు తగ్గించింది.
 
ఇక మధ్యప్రదేశ్‌లో కూడా కర్నాటక పరిస్థితే ఉంది. అయితే అక్కడ మేజిక్ ఫిగర్‌కి రెండంకెలు తక్కువగా ఉన్న కాంగ్రెస్.. బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల దయతో గద్దెనెక్కింది. అప్పటినుంచీ బీజేపీ అదను కోసం ఎదురుచూస్తోంది, తాజాగా కర్నాటకలో అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ పైన కొంతమంది బీజేపీ నేతలు నోరుజారారు. తాము తలచుకుంటే ఎప్పుడో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేదని సవాళ్లు విసిరారు. అయితే అక్కడ విచిత్రంగా బీజేపీ ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
 
ఇక ఏపీ విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి రాజకీయ సంక్షోభం వస్తుందేమోనని బీజేపీ ఎదురుచూసింది. టీడీపీ, వైసీపీ, జనసేన త్రిముఖ పోరులో హంగ్ తప్పదని అంచనా వేసింది. బీజేపీ కంటే ఎక్కువగా టీడీపీ ఈ అంచనాల్లో మునిగితేలింది. వైసీపీ పెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకి ఎవరో ఒకరి మద్దకు అవసరమైన పక్షంలో ఏం చేయాలన్నదానిపై మంతనాలు కూడా సాగాయి. ఆ దిశగానే టీడీపీ, బీజేపీ లెక్కలేసుకున్నాయి. కానీ జనసేన ఆటలో అరటిపండు కావడంతో అందరూ మునిగారు. 
 
కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో తొలిసారి 151 సీట్ల భారీ మెజార్టీతో గెలిచారు జగన్. ఐతే ఏపీలో ఎన్నిచేసినా చివరకు బీజేపీని రాష్ట్ర ప్రజలు ప్రత్యేకహోదా కోణంలోనే చూస్తారు. హోదా ఇస్తేనే బీజేపీకి ఏపీలో మనుగడ. లేదంటే దేశమంతా బీజేపీ హవా నడిచినా, ఏపీలో మాత్రం ఆ పార్టీ నేతలకు డిపాజిట్లు దక్కవనే వాదనలు బలంగా వున్నాయి. మరి ప్రత్యేక హోదా ఇచ్చేసి ఏపీలో పాగా వేస్తారో లేదంటే ప్యాకేజీ అంటూ పాలన పగ్గాలకు దూరంగా వుంటారో చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్క మొగుడిపై మోజు... సొంత అక్కనే పొడిచి చంపేసిన చెల్లెలు....