Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైట్ మనీ లేదు... బ్లాక్ మనీ బిగుసుకుపోయింది... బెజ‌వాడ‌లో రియ‌ల్ బూమ్ ఢమాల్...

విజయవాడ: అస‌లే రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో రియ‌ల్ మార్కెట్ స్లంప్‌లో ఉంది. దీనికితోడు మోడీ పేల్చిన నోటు బాంబుతో రియ‌ల్ బూమ్ పూర్తిగా కుప్ప‌కూలిపోయింది. గుంటూరు - విజ‌య‌వాడ మ‌ధ్య నిన్నమొన్నటి వరకు ఎకరం 15 కోట్లు పలికిన భూములు ఇపుడు ఎందుకు కొర‌గానివిలా మా

వైట్ మనీ లేదు... బ్లాక్ మనీ బిగుసుకుపోయింది... బెజ‌వాడ‌లో రియ‌ల్ బూమ్ ఢమాల్...
, బుధవారం, 16 నవంబరు 2016 (12:55 IST)
విజయవాడ: అస‌లే రాష్ట్ర విభ‌జ‌న‌తో ఏపీలో రియ‌ల్ మార్కెట్ స్లంప్‌లో ఉంది. దీనికితోడు మోడీ పేల్చిన నోటు బాంబుతో రియ‌ల్ బూమ్ పూర్తిగా కుప్ప‌కూలిపోయింది. గుంటూరు - విజ‌య‌వాడ మ‌ధ్య నిన్నమొన్నటి వరకు ఎకరం 15 కోట్లు పలికిన భూములు ఇపుడు ఎందుకు కొర‌గానివిలా మారిపోయాయి. బెజ‌వాడ శివారులో ఎకరం 12, 13 కోట్ల వరకు ఇచ్చి కొనడానికి ముందుకొచ్చిన వారిని కూడా రైతులు ఎగాదిగా చూసేవారు. అటు పెనమలూరు, ఇటు గన్నవరం, మరోవైపు ఇబ్రహీంపట్నం వరకు దాదాపు ఇదే పరిస్థితి.
 
రాయపూడి, తుళ్లూరు వగైరా గ్రామాల్లో సైతం ఇప్పటికీ ఎకరం పది లక్షలు ప్రభుత్వ విలువ ఉన్న భూమి రెండు కోట్లపైగా పలికింది. ఇది నాలుగు రోజుల కిందటి మాట. ఇప్పుడు.. భూములు కావాలని అడిగేవారూ కనబడటం లేదు. అమ్ముతామనేవారు కూడా లేరు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రభావం రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన 8వ తేదీ నుంచి నగరంలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పెద్ద రిజిస్ట్రేషన్ కూడా జరుగలేదు. 
 
రోజుకు కనీసం 20 నుంచి 25 డాక్యుమెంట్లు జరిగే గుణదల రిజిస్ట్రార్ కార్యాలయంలో ఐదారు రోజులుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య పది కూడా దాటడం లేదు. అది కూడా తనఖా రద్దు, గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్లు వంటివి మాత్రమే జరుగుతున్నాయి. రాత్రి 9 గంటల వరకు రిజిస్ట్రేషన్లతో బిజీగా ఉండే పటమట రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సాయంత్రం ఆరింటికే ఇళ్లకు వెళ్లిపోయే పరిస్ధితిలో ఉంది. 
 
వైట్ మ‌నీ ఏదీ? బ‌్లాక్ బిగుసుకుపోయింది....ఇక దారేది?
గతంలో ఎకరం రూ.20 కోట్లు పెట్టి కొన్న భూమికి ప్రభుత్వ విలువ రూ.50 లక్షలు మాత్రమే ఉండేది. మిగిలినదంతా బ్లాక్‌లోనే న‌డిచేది. భూమిని అమ్ముకున్న వ్యక్తి కొంచెం దూర ప్రాంత గ్రామాలకు వెళ్లి అక్కడ తక్కువ రేట్లుకు వ్యవసాయ భూములు కొనేవారు. అక్కడ కూడా ప్రభుత్వ విలువ ఎకరం రూ.2 లక్షలు ఉంటే బ్లాకులో రూ.15 నుంచి రూ.20 లక్షలు పెట్టి కొనేవారు. విజయవాడలో భూముల ధరలు పెరిగిపోవడంతో దీని ప్రభావం జిల్లా వ్యాప్తంగా పడింది. ఇప్పుడున్న పరిస్ధితులలో భూమి కొనేవారి వద్ద బ్లాక్‌ మనీ ఉన్నా అమ్మేవారు దానిని తీసుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు కొత్తగా భూమిని కొనలేరు. 
 
ఒకవేళ కొన్నా, మొత్తం బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే భవిష్యత్తులో ఆదాయ పన్ను శాఖ నుంచి శ్రీముఖాలు అందుకోవలసి వస్తుంది. అక్రమమని తేలితే 200 శాతం పెనాల్టీ, సర్‌చార్జి కలిపి కట్టాల్సి ఉంటుంది. అంటే రూ.కోటి అక్రమంగా ఉన్నట్టు తేలితే 31 శాతం పన్ను, అంటే 31 లక్షలు, 200 శాతం పెనాల్టీ అంటే 62 లక్షలు, సర్‌చార్జి మరో 15 శాతం అంటే 15 లక్షలు కలిపి కోటి అయిదు లక్షల వరకు కట్టవలసి ఉంటుంది. అక్రమంగా సొమ్ము దాచినందుకు ఆదాయ పన్ను శాఖ కేసులు కూడా ఫైల్‌ చేయవచ్చు. అందుకే ఎవరూ రియల్‌ ఎస్టేట్‌ వైపు చూడటం లేదు. ఇలా మొత్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లధన కోటీశ్వరులు పిచ్చోళ్లుగా మారే సమయమిదే... వాళ్లేమైనా చేయొచ్చు జాగ్రత్త....