'మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ ఏపీజే అబ్ధుల్ కలాం పుట్టిన రోజు. తమిళనాడు, రామనాథపురంలో పుట్టిన ఆయన తన ఐదన ఏటనే పేపర్ బాయ్‌గా మారారు. అలా రామనాథపురంలో హయ్యర్ సెకండరీ స్కూల్లో విద్యను పూర్తి చేశారు. కలామ్ ఫిజిక్స్, మ్యాథ్స్‌ను బాగా ఇష్టపడేవారు. ఆ తర్వాత తిరుచురాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీ నుండి 1954లో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత 1955లో మద్రాసులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరి అక్కడ పట్టభద్రుడయ్యారు.
1960లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేరాడు. 1969లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు బదిలీ అయ్యారు.
కలామ్ భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1970-1990 మధ్యకాలంలో, అబ్దుల్ కలాం ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహనం (పిఎస్‌ఎల్‌వి) మరియు ఎస్‌ఎల్‌వి -3 ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు, ఇవి విజయవంతమయ్యాయి.
ఇందుకు గాను కలామ్‌కు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం, భారతరత్న(1997), పద్మభూషణ్ (1981) మరియు పద్మ విభూషణ్ (1990)తో సహా అనేక అవార్డులతో ఆయనను సత్కరించారు. తర్వాత 2002 నుండి 2007 వరకు ఆయన భారతదేశ 11వ రాష్ట్రపతిగా పనిచేశారు.
అప్పటికే ఆయన 40 విశ్వవిద్యాలయాల నుండి 7 గౌరవ డాక్టరేట్లు పొందారు. అవినీతిని నిర్మూలించేందుకు మే 2012లో కలాం వాట్ కెన్ ఐ గివ్ మూవ్మెంట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా జీవితాన్ని కొనసాగిస్తున్న అబ్దుల్ కలామ్ జూలై 27, 2015న, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ షిల్లాంగ్‌లో ఉపన్యాసం ఇస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆ తర్వాత తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అప్పటికి ఆయన వయస్సు 84 సంవత్సరాలు.
ఇంకా ఆయన గురించిన విశేషాలు..
కలామ్ శాకాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి. కచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్‌తో పాటు, భగవద్గీతను కూడా చదివేవారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు, మానవతావాది. ఆయన తిరుక్కురల్ చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం" నైనా ప్రస్తావిస్తారు. కలాం భారతదేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు.