ఎర్రచందనం వేటగాళ్ల ఆస్తులపై వేట..... కూపీ లాగుతున్న ఏపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్
ఎర్రచందనం దొంగల అక్రమాస్తులపై నిఘా పెరిగింది. గత పదేళ్ళలో ఎవరెవరు ఎంతెంత అక్రమంగా దోచేశారో.. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందం కూపీ లాగుతోంది. అక్రమార్కుల ఆస్తులపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం ప్ర
ఎర్రచందనం దొంగల అక్రమాస్తులపై నిఘా పెరిగింది. గత పదేళ్ళలో ఎవరెవరు ఎంతెంత అక్రమంగా దోచేశారో.. టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందం కూపీ లాగుతోంది. అక్రమార్కుల ఆస్తులపై చర్యలు తీసుకునే అధికారాన్ని ప్రభుత్వం ప్రత్యేక కార్యదళానికి కట్టబెడుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్న దరిమిలా ఆ యంత్రాంగం రంగంలోకి దిగింది. డిఎస్పీల ఆధ్వర్యంలోని ప్రత్యేక నిఘా బృందాలు రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేటను ఆరంభించాయి.
ఎర్రచందనాన్ని దొడ్డిదారిలో తెగనరికి దేశ విదేశాలకు తరలించిన ఎందరో అక్రమార్కులు కోట్లు గడించారు. వీరిలో పట్టుబడిన వారు కొందరైతే దొరకని దొంగలు వందల్లోనే ఉన్నారు. దొరికిన వారిపై కూడా ప్రత్యేక కార్యదళం (స్పెషల్ టాస్క్ ఫోర్స్) ఇటీవల వరకు కేసులు నమోదు వరకే పరిమితమైంది. తాజాగా కొన్నిరోజుల క్రితం రాష్ట్ర అటవీ చట్టంలో చేసిన సవరణ మేరకు కార్యదళానికి అక్రమార్కుల ఆస్తులపై చర్యలు తీసుకునే అధికారమూ దాఖలు పడింది. దీంతో అటవీ పోలీసులు స్మగ్లర్ల ఆస్తులపై నిఘా పెంచారు.
రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగస్వామ్యులైన వారి జాబితాను టాస్క్ ఫోర్స్ సేకరిస్తోంది. రాజకీయ పార్టీలకు చెందని ప్రముఖులు సైతం ఈ దందాలో ఉనన్నారన్న సమాచారంతో వీరిపై చర్యలకు ఎలా ఉపక్రమించాలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఆరు జిల్లాల్లో వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక్కో బృందానికి ఒక్కో డీఎస్పీ ఆధ్వర్యంలో 15-20 సిబ్బందిని సమకూర్చి క్షేత్రస్థాయిలోకి దింపారు. గత పదేళ్ళలో కొందరు బడా స్మగ్లర్లు రాజకీయ నేతల ప్రోత్సాహంతో పెద్ద ఎత్తున ఇక్కడి ఎర్రచందనం దుంగలను సరిహద్దులు దాటించారు.
శేషాచలం అడవుల నుంచి దుబాయి, చైనా, జపాన్, మలేషియా తదితర దేశాలకు సంపద తరలించి సొమ్ము చేసుకున్నారు. కోట్లాది రూపాయల విలువైన ప్రకృతి ప్రసాదిత ఎర్రచందనం అక్రమార్కులపరమైంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఈ అక్రమ వ్యాపారం ఒక సామ్రాజ్యంలా విస్తరించింది.
రాజకీయ, ఉద్యోగ, పోలీసు, మీడియా వర్గాల్లోని వ్యక్తులు కూడా భాగస్వామ్యులు కావడంతో ఇదంతా గుట్టుగా సాగింది. వీటిలో కొన్ని కేసులు పోలీసులు చేధించినా.. కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సవరించిన చట్ట ప్రకారం ఆస్తుల జప్తు ఇతరత్రా చర్యలు తీసుకునే అధికారం రావడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు పాత రికార్డులు తిరగేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో టాస్క్ ఫోర్స్ నిఘా బృందాలు పూర్తి స్థాయిలో తమ రహస్య వివరాల సేకరణను ముమ్మరం చేయనున్నాయి. బృందాలకు నేతృత్వం వహిస్తున్న డిఎస్పీలు తమకు కేటాయించిన జిల్లాల్లో సమర్థులుగా పేరొందిన పోలీసు, అటవీశాఖల అధికారులు, సిబ్బంది సహకారాన్ని తీసుకుంటున్నారు. వారి ద్వారా అక్రమార్కుల వివరాల జాబితాను సిద్ధం చేయనున్నారు.
ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ వద్ద రాయలసీమకు చెందిన ప్రముఖ స్మగ్లర్లు గంగిరెడ్డి, విజయానందరెడ్డి, వెంకటరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి, రెడ్డి నారాయణ, బాబు తదితరులు వారికి సహకరించిన కూలీలు, దొంగల చిట్టా ఉంది. వీరికి తిరుపతి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఇంతకాలం ఆయా ఆస్తులను ఎవరు పర్యవేక్షించారు? బినామీలు ఎవరు? రహస్యంగా దాచిన ఆస్తులెక్కడ ఉన్నాయి? తదితర వివరాలను సేకరిస్తున్నారు. చెన్నై, బెంగుళూరు, కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాలలో వీరికి ఉన్న సంబంధాలు..అక్కడి వారి అక్రమాస్తులపైన నిఘా పెట్టారు.
కొందరు స్మగ్లర్లు రూ.100 కోట్లకు మించి ఆస్తులను కూడబెట్టినట్లు టాస్క్‌ఫోర్స్ కు సమాచారం ఉంది. ఆ మొత్తాన్ని జప్తు చేసే దిశగా రికార్డులు సేకరించబోతున్నారు. గతంలో నేరగాళ్ళకు సహకరించిన పోలీసు, అటవీ, రవాణా శాఖలు సహా పలు పోర్టులోని సిబ్బంది, అధికారుల గురించి కూడా కూపీ లాగుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అదికారులు, సిబ్బంది కొందరి జాబితాను ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం.