Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శత జయంత్యుత్సవం: ఇందిరమ్మ వందేళ్ల జ్ఞాపకాలు

జనరంజక పాలనతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరమ్మ. పాలన అంటే.. ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలన్నంతగా గుర్తింపు పొందారు. బలమైన నేతగా ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించారు.

శత జయంత్యుత్సవం: ఇందిరమ్మ వందేళ్ల జ్ఞాపకాలు
, ఆదివారం, 19 నవంబరు 2017 (08:16 IST)
జనరంజక పాలనతో ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకురాలు ఇందిరమ్మ. పాలన అంటే.. ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలన్నంతగా గుర్తింపు పొందారు. బలమైన నేతగా ప్రత్యర్థి పార్టీలకు వణుకు పుట్టించారు. తన చివరి రక్తపు బొట్టు కూడా దేశానికే అంకితం చేసిన ఇందిరా గాంధీ శతజయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. 
 
పట్టుదలకు ప్రతిరూపం. సాహసోపేత నిర్ణయాలకు చిరునామా. ప్రత్యర్థుల ఎత్తుల్ని చిత్తు చేయడంలో ఇందిరకు మించినవారు లేరు. 1917 నవంబర్ 19న అలహాబాద్ లో జన్మించిన ఇందిర అసలు పేరు ఇందిరా ప్రియదర్శిని. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి నాయకత్వ లక్షణాలు సొంతం చేసుకున్నారు. 12 ఏళ్ల వయసులోనే.. మంకీ బ్రిగేడ్ ఏర్పాటు చేసి.. స్వాతంత్ర్య ఉద్యమంలో భాగమయ్యారు. 8 నెలలు జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత.. తండ్రితో కలిసి దేశమంతా పర్యటించారు. స్వాతంత్ర్యం వచ్చాక.. నెహ్రూ ప్రధాని కావటంతో.. రాజీకీయాల్లోనూ అత్యంత కీలక పాత్రను పోషించారు. 
 
1942లో ఫిరోజ్ గాంధీతో వివాహంతో ఇందిరా గాంధీగా మారారు. 1955లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1964లో నెహ్రూ చనిపోవటంతో.. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. నెహ్రూ మరణంతో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై ఆ కేబినెట్‌లో సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. రేడియో కార్యక్రమాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు ప్రసారం చేశారు. 1966లో శాస్త్రి చనిపోయాక.. దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సమయంలో.. భారత మొదటి మహిళా ప్రధానిగా బాధ్యతలు ఆమె స్వీకరించారు. ఆ తర్వాత 1967.. 1971లో వరుసగా ప్రధానిగా ఎన్నికయ్యారు.
 
ప్రధానిగా పాలనలో తనదైన ముద్ర వేశారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. జనాకర్షక పథకాలతో.. ఇందిరమ్మగా జనం మనసులో నిలిచిపోయారు. 19 బ్యాంకులను జాతీయం చేసి.. బ్యాంకింగ్ రంగాన్ని ప్రజలకు చేరువ చేశారు. రాజభరణాలను రద్దుచేశారు. బంగ్లాదేశ్ విమోచనం, పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో విజయంతో.. తిరుగులేని నేతగా మారారు. 1974లో తొలిసారిగా దేశంలో అణుపరీక్షలు జరిపారు. అంతరిక్షంలోకి మొదటి ఉపగ్రహాన్ని ఆమె హయాంలోనే పంపారు. 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. గరీభ్ హటావో నినాదంతో దేశంలో పర్యటించిన ఇందిరకు.. జనం జేజేలు పలికారు.
 
ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో పాలనలో ఇందిర చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ నిర్ణయం తన ప్రాణాలే బలిగొంటుందని ఊహించలేకపోయారు. పవిత్రంగా భావించే స్వర్ణ దేవాలయంలో కాల్పులు జరపటం.. సిక్కుల మనోభావాలను దెబ్బతీసింది. దీంతో ఇందిర హత్యకు కుట్ర జరిగింది. 1984 అక్టోబర్ 31న.. రక్షణ కల్పించాల్సిన బాడీగార్డుల చేతుల్లోనే ఆమె బలయ్యారు. ఇందిరాగాంధీ శత జయంతిని కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. సంవత్సరం మొత్తం జరిగిన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్తీక మాసం చివరి రోజున ఈ పని చేయడం ఎంతో సంతోషం... చంద్రబాబు