Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజాకు కాంగ్రెస్ తీర్థం: తెదేపాలో కలకలం!!!

రోజాకు కాంగ్రెస్ తీర్థం: తెదేపాలో కలకలం!!!
, బుధవారం, 5 ఆగస్టు 2009 (16:29 IST)
File
FILE
రాష్ట్ర రాజకీయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. "ఆపరేషన్ ఆకర్ష్", "ఆపరేషన్ వికర్ష్‌"‍ల ఫలితంగా తమ నేతలను కాపాడుకునేందుకు ప్రజారాజ్యం, తెలంగాణా రాష్ట్ర సమితిలు ముప్ప తిప్పలు పడుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా చేరింది. ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి బుధవారం అసెంబ్లీ ఆవరణంలో చేసిన 'ఆపరేషన్ ఆకర్ష్' వ్యాఖ్యలే ఇందుకు కారణం.

తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రాయబారాలు నడుపుతోందని ఆయన వ్యాఖ్యానించి మిన్నకున్నారు. ప్రతిపక్షాల్లో అలజడి రేపి, లబ్ధి పొందాలన్నది వైఎస్ రాజకీయ వ్యూహంగా ఉందన్నది స్పష్టమైన విషయం. అయితే, వైఎస్ చేసిన వ్యాఖ్యలు మాత్రం తెదేపా నేతల్లోనే కాకుండా రాష్ట్ర మీడియాలో సైతం కలకలం సృష్టించాయి.

తెదేపాలో క్రియాశీల మహిళా నేతగా, స్టార్‌ గ్లామర్‌ సొంతం చేసుకున్న రోజా కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి యత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలు సర్వదా చర్చనీయాంశమయ్యాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ స్వయంగా రోజా కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు చెప్పడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ పరిణామంతో ఖంగుతిన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మరుక్షణమే రోజాకు ఫోన్‌చేసి నేరుగా ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని రోజా వివరణ ఇచ్చుకున్నారు. తాను తెలుగుదేశం పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్ళబోనని రోజా... తన అధినేతకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి.
webdunia
File
FILE


అనంతరం అసెంబ్లీ లాబీలో చంద్రబాబు విలేఖర్లతో మాట్లాడుతూ, పార్టీలో గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి వైఎస్‌ కావాలనే ఇలాంటి అసత్యప్రచారాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆ తర్వాత రోజా స్వయంగా మీడియా ముందుకు వచ్చి వైఎస్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకోక తప్పలేదు. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు వచ్చిన వార్తలను ఆమె ఖండించారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు.
తెలుగుదేశం పార్టీ తనను సొంత సోదరిలా ఆదరించిందని, అలాంటి పార్టీని వీడి తాను ఎక్కడికీ వెళ్ళబోనని ఆమె విలేఖర్లకు వివరించారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానంటూ వైఎస్‌ ఎందుకు చెప్పారో తనకు అంతుచిక్కడం లేదని రోజా వాపోయారు.

మొత్తం మీద.. ముఖ్యమంత్రి వైఎస్ సినీ నటి రోజాపై చేసిన వ్యాఖ్యలు తెదేపా అధినేతను చిక్కుల్లో ఇరికించేలా చేశాయి. ముఖ్యంగా ఏ ఒక్క వ్యక్తిని నమ్మని బాబు... వైఎస్ వ్యాఖ్యలు రోజాను సైతం అనుమానించే పరిస్థితికి తెచ్చాయి. అందువల్లే బాబు తక్షణం రోజాకు ఫోన్ చేసి అసలు విషయంపై ఆరా తీయడం ఇందుకు నిదర్శనం.

Share this Story:

Follow Webdunia telugu