Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బావా తప్పు చేశాను... నా ముఖం నీకు చూపించలేక చనిపోతున్నా.. భర్తకు భార్య సెల్ఫీ వీడియో!!

Advertiesment
suicide

వరుణ్

, మంగళవారం, 23 జులై 2024 (09:34 IST)
బావా నేను తప్పు చేశా. కుటుంబం బాగుండాలని నీకు తెలియకుండా తప్పు చేశా. ఆ తర్వాత తెలిసింది.. నేను మోసపోయానని. దీంతో నా ముఖం నీకు చూపించలేకపోతున్నా. అందుకే మిమ్మలను వదిలి వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించు బావా అంటూ ఓ వివాహిత తన భర్తకు సెల్ఫీ వీడియో పంపించి.. ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ గ్రామానికి చెందిన పేటేటి స్రవంతి (28) అనే మహిళకు మొబైల్ ఫోనులో రూ.5 లక్షలు రుణం ఇస్తామని ఓ మెసేజ్ వచ్చింది. కష్టకాలంలో కుటుంబానికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ఆ నంబరును సంప్రదించింది. రూ.5 లక్షలు రుణం ఇవ్వాలని కోరింది. అయితే, యాప్ లోన్ నిర్వాహకులు మాత్రం తొలుత రూ.20 వేలు, ఆ తర్వాత రూ.60 వేలు ఇవ్వాలని కోరడంతో తనకు తెలిసిన వారి వద్ద రూ.80 వేలు అప్పు తెచ్చి చెల్లించింది. కొద్ది రోజుల తర్వాత మళ్లీ మరో రూ.1.20 లక్షలు చెల్లిస్తే మొత్తం రుణం డబ్బులు ఇస్తామని చెప్పారు. అయితే, అంత మొత్తం తాను కట్టలేనని చెప్పింది. పైగా, యాప్ లోన్ నిర్వాహకుల చేతిలో తాను మోసపోయినట్టు గ్రహించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పుకోలేకపోయింది. తాను తప్పు చేశాననే బాధతో భర్తకు ముఖం చూపించలేక భర్త శ్రీకాంత్‌ను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి అందులో జరిగిన విషయాన్ని పుట్టెడు దుఃఖంతో వివరించింది.
 
'బావా.. తప్పుచేశాను. మన కుటుంబం కోసమే ఈ పనిచేశాను. నీకు ముఖం చూపించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ' సెల్ఫీ తీసుకొని ఆదివారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఉయ్యూరు ఆస్పత్రికి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. సోమవారం మధ్యాహ్నం అక్కడ ఆమె మృతి చెందింది. తన మరణానికి కారణం అంతా వివరిస్తూ చరవాణిలో ఆమె పెట్టిన సెల్ఫీ బయటకు వచ్చింది. 
 
కాగా, స్రవంతికి 6, 4 సంవత్సరాల కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆమె పుట్టిల్లు ఇదే మండలం కృష్ణాపురం కాగా.. ఆమె మేనత్త కొడుకు శ్రీకాంత్‌తో వివాహమైంది. అతడు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ ఫోనులో వచ్చే ఇలాంటి మెసేజ్‌లను నమ్మవద్దంటూ తాము పదేపదే ప్రచారం చేస్తున్నా కొంతమంది అర్థం చేసుకోలేక ఇలా చిక్కుల్లో పడి పండంటి జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారని, ఇకనైనా అవగాహనతో మెలగాలని పోలీసులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంగోలులో స్పా - మసాజ్ కేంద్రాల్లో అనైతిక కార్యకలాపాలు.. విటులు - యువతుల అరెస్టు!!