Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐదేళ్ల కుమార్తెను కాటేసిన తండ్రి... మరణించేంత వరకు జైలుశిక్ష

Advertiesment
Jail

ఠాగూర్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (13:33 IST)
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. తన ఐదేళ్ల కుమార్తెపై అత్యంత క్రూరంగా, ఓ మృగంలా ప్రవర్తించాడు. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఆ కసాయికి విశాఖపట్నం పోక్సో కోర్టు అత్యంత కఠినమైన శిక్ష విధించింది. నిందితుడు మరణించేంత వరకు జైలులోనే ఉండాలని సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇలాంటి శిక్ష విధించడం చాలా అరుదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి తన భార్య, ఐదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారుడితో కలిసి విశాఖలోని జాలారిపేటలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15న భార్యతో గొడవపడి ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
 
అదేరోజు రాత్రి మద్యం మత్తులో తగరపువలసలోని పాత సినిమాహాలు వద్ద ఓ దుకాణం ముందున్న రేకుల షెడ్డులో పిల్లలను నిద్రపుచ్చాడు. అర్థత్రి సమయంలో నిద్రిస్తున్న తన ఐదేళ్ల కుమార్తెపై పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. చిన్నారి ఏడుపులు విని అక్కడే ఆగి ఉన్న లారీ డ్రైవర్, క్లీనర్ గమనించారు. వారు వెంటనే సమీపంలోని సెక్యూరిటీ గార్డుకు చెప్పగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
 
ఘటనా స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు, అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించి నేరాన్ని నిర్ధారించారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అనంతరం కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అప్పటి ఏసీపీ పెంటారావు ఈ కేసు దర్యాప్తును చేపట్టి, పక్కా ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు.
 
సీసీ ఫుటేజీ, వైద్యుల నివేదికలు, ఇతర సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుడిని దోషిగా తేల్చి మరణించేంత వరకు జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికెన్ అడిగిన కన్నబిడ్డలను కొట్టిన తల్లి.. కొడుకు మృతి.. ఎక్కడ?