ఇంతకాలం నన్ను భరించినందుకు కృతజ్ఞతలు అమ్మా... నాన్నను జాగ్రత్తగా చూసుకో అని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన ఓ విద్యార్థి ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆత్మహత్య చేసుకుని, తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాడు. పైగా, తన స్నేహితులతో కలిసి అర్థరాత్రి వరకు పార్టీ చేసుకుని.. ఇదే నాకు చివరి రోజు కావొచ్చు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టాడు. దాన్ని చూసిన స్నేహితుడు.. రాత్రికి నీకే తెలుస్తుందిలే అని తిరిగి రిప్లై ఇచ్చాడు. తెల్లారేసరికి నిజంగానే ఆ విద్యార్థి మృత్యుఒడిలోకి జారుకున్నాడు.
విజయవాడ నగర శివార్లలో ఇంజినీరింగ్ విద్యార్థి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామ పరిధిలో మృతదేహం మూడొంతులకు పైగా కాలిపోయి, గుర్తించలేని స్థితిలో బుధవారం ఉదయం కనిపించింది. స్థానిక రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతి వెలుగులోకి వచ్చింది. మృతిపై పెనమలూరు పోలీసులు ఆనవాళ్లను బట్టి తొలుత హత్య కేసుగా నమోదు చేశారు. ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చని పోలీసులు అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలివీ..
జమ్ములమూడి జీవన్ (21) అనే విద్యార్థి విజయవాడ నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో మూడో యేడాది బీటెక్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు నాగమణి, సుధాకర్. వీరి స్వగ్రామం తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం. వీరు కొంతకాలం కిందట నగరంలో క్రీస్తురాజపురం వచ్చి ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. తండ్రి సుధాకర్ ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్.
ఇటీవల లోన్ తాలూకూ ఈఎంఐ కట్టమని జీవన్‌కు తండ్రి రూ.12 వేలు ఇచ్చాడు. డబ్బును వివిధ అవసరాలకు ఖర్చు చేశాడు. ఈ సంగతి తెలిసి రెండు రోజుల కిందట తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికిగురై సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుడి ఇంట్లోనే పడుకున్నాడు. తిరిగి మంగళవారం ఇంటికి వచ్చాడు. సాయంత్రం స్నేహితుడి పుట్టిన రోజు పార్టీ ఉందని ఇంట్లో తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. ఆ సమయంలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బహుశా.. ఇదే తన చివరి రోజు అని పోస్టు పెట్టాడు.
దీనిని చూసిన ఓ స్నేహితుడు వెటకారంగా పోస్టు చేశాడు. 'సరేలే.. ఈరోజు రాత్రికి తెలుస్తుందిలే' అని సమాధానం పెట్టాడు. ఆ తర్వాత స్నేహితుడు శ్యామ్ పుట్టినరోజు సందర్భంగా గురునానక్ కాలనీలోని ఓ హోటల్‌లో జరిగిన పార్టీకి జీవన్ హాజరయ్యాడు. రాత్రి 9 గంటలకు ఇతను తల్లి నాగమణికి ఫోన్ చేయగా మామూలుగానే మాట్లాడాడు. పార్టీ ముగిశాక 11 గంటలకు ఇంటికి రానున్నట్లు తెలిపాడు. పార్టీ అనంతరం స్నేహితులతో కలసి అక్కడే నిద్రపోయారు. హఠాత్తుగా 12.30 గంటలకు స్నేహితుడిని నిద్రలేపి, ద్విచక్ర వాహనం తాళాలు తీసుకుని బయటకు వచ్చాడు.
అనంతరం తెల్లవారుజామున 2 గంటల సమయంలో యనమలకుదురులో పెట్రోల్ బంకుకు వెళ్లి.. సీసాలో రూ.100కు పెట్రోల్ పోయించుకున్నాడు. తర్వాత 1.49 గంటల సమయంలో తండ్రి సుధాకర్ మొబైల్‌కు ఫోన్ చేశాడు. ఈఎంఐ డబ్బును సొంతానికి వాడుకున్నానని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని ఆవేదన వ్యక్తం చేశాడు. తల్లితో కూడా మాట్లాడాడు.
'నాన్నను నేను సంతోష పెట్టలేకపోతున్నా.. నేను ఎప్పుడూ మిమ్మల్ని నిరాశపరుస్తూనే ఉన్నా.. నాన్నను జాగ్రత్తగా చూసుకో.. నన్ను భరించినందుకు కృతజ్ఞతలు అమ్మా..' అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత మూడుసార్లు ఫోన్ చేసినా జీవన్ ఎత్తలేదు. అక్కడి నుంచి పెదపులిపాక వెళ్లి పెట్రోల్‌ను తలపై పోసుకుని నిప్పంటించుకుని ఘటనా స్థలంలోనే చనిపోయాడు.
బుధవారం ఉదయం మృతదేహాన్ని పెదపులిపాక రైతులు గుర్తించారు. పెదపులిపాక-చోడవరం కరువు కాల్వ కట్టకు ఫర్లాంగు దూరంలో డొంకరొడ్డులో మృతదేహం పడి ఉంది. తలభాగం నుంచి కాళ్ల వరకూ కాలిపోయి ఉంది. పెట్రోల్ బంకు నుంచి ద్విచక్ర వాహనంపై ఒక్కడే బయలుదేరినట్లుగా ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. తలపై పెట్రోలు పోసుకుంటుండగా కొంత ఊపిరితిత్తుల్లోకి వెళ్లినట్లుగా గుర్తించారు. సొంతంగా నిప్పంటించుకుని మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు అందరినీ కలచివేసింది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.