అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీని విద్యార్థులు వక్రమార్గంలో వినియోగిస్తున్నారు. తాజాగా యూపీకి చెందిన కొందరు విద్యార్థులు కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో తమకు పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా చిత్రీకరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
యూపీలోని మొరాదాబాద్ లోని ఓ ప్రతిష్టాత్మక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో వారి ఉపాధ్యాయురాలి ఫోటోలను అశ్లీలంగా రూపొందించి సోషల్ మీడియా (ఇన్‌స్టాగ్రామ్)లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా మరికొందరు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇలాంటి ఫోటోలు రూపొందించి వాటినీ వైరల్ చేస్తామని బెదిరించారు. ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ జరిగి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధిత ఉపాధ్యాయురాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.
దీనిపై ఆమె సివిల్ లైన్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత టీచర్ ఫిర్యాదు మేరకు ఇద్దరు విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్.ఓ.మనీష్ సక్సేనా తెలిపారు. సైబర్ సెల్ సాయంతో దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అలానే ఇన్‌స్టా నుండి బాధిత ఉపాధ్యాయురాలి ఫోటోల తొలగింపునకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.