ఏపీలోని విశాఖపట్టణంలో ఓ దారుణం చోటు చేసుకుంది. మాటలు సరిగా రాని 11 యేళ్ళ మైనర్ బాలికపై ఇద్దరు మైనర్ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. గ్రహణ మొర్రి కారణంగా ఆ బాలికకు సరిగా మాటలు రావు. పైగా, ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇది స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు.. సీతమ్మధార కొండ ప్రాంతంలోని బిలాల్ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారి 11 ఏళ్ల కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. గ్రహణం మొర్రి ఉండటంతో ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆ బాలిక సరిగా మాట్లాడలేని స్థితిలో ఉంది. వీరి ఇంటికి సమీపంలోనే 16 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు నివసిస్తున్నారు. వారిలో ఒకరు ఐటీఐ రెండో సంవత్సరం చదువుతుండగా, మరొకరు ఎనిమిదో తరగతితోనే చదువు మానేశారు.
ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలిక తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లారు. ఇంట్లో చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితులు, ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని తుప్పల్లోకి తీసుకెళ్లారు. బాలిక ఎంత ఏడుస్తున్నా కనికరించకుండా ఇద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.
పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతుకుతుండగా, కొండవాలున ఉన్న తుప్పల్లోంచి బాలిక ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా, రక్తస్రావంతో బాధపడుతున్న కుమార్తెను చూసి హతాశులయ్యారు. వెంటనే వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా పోలీసులు, బాలిక పరిస్థితిని గమనించి ప్రాథమిక విచారణ చేపట్టారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకుని నిందితులపై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ కింద పలు సెక్షన్ల మేరకు కేసు నమోదు చేశారు. నిందితులైన ఇద్దరు మైనర్లను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.