Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కూతురు మెడలో తాళి తెంచి జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ....

Advertiesment
కూతురు మెడలో తాళి తెంచి జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ....
, బుధవారం, 22 డిశెంబరు 2021 (11:43 IST)
సమాజంలో ఈ సంఘర్షణ పరంపరకు అడ్డు లేదు. తమకు తెలియకుండా కుమారుడో, కూతురో ఎవరినో ప్రేమించేయడం. కన్నవారిని కాదని రాత్రికిరాత్రే తమకు నచ్చినవారితో వెళ్లిపోవడం, పెళ్లి చేసేసుకోవడం. అలా తమ గుండెలపై తన్నేసి ఎవరితోనే వెళ్లిపోవడంతో.... పుట్టిన దగ్గర్నుంచి కంటికిరెప్పలా కాపాడుకుని వచ్చిన తల్లిదండ్రుల గుండెలు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నాయి.

 
ఇలాంటి దాఖలాలు ఇప్పటివి కాదు... ఎప్పటి నుంచో జరుగుతున్నవే. తమ ప్రేమను పెద్దవారిని ఒప్పించే ఓర్పులేని పిల్లలు ఒకవైపు, పిల్లల మనసును అర్థం చేసుకుని వారికి నచ్చినవారికి ఇవ్వలేని పెద్దలు ఇంకోవైపు. ఈ సంఘర్షణలో ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయి. ఇలాంటి ఉదంతాలు ఎన్నో.

 
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నాటకలోని మైసూరు నంజనగూడు తాలూకాలోని హరతళె గ్రామానికి చెందిన బసవరాజ్ తన కుమార్తె చైత్రను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఉన్నత స్థాయికి తీసుకురావాలని కలలు కన్నాడు. ఆమె అడిగినది అడిగినట్లు ఇచ్చేవాడు. ఐతే అతడికి తెలియకుండా అతడి కుమార్తె చైత్ర హళ్లెర గ్రామానికి చెందిన మహేంద్ర అనే యువకుడితో ప్రేమ సాగిస్తోంది. తల్లిదండ్రులకు తెలియకుండా ఏడాదిన్నరగా గోప్యంగా అతడితో ప్రేమాయణం సాగిస్తోంది.

 
చివరికి అసలు విషయం తండ్రి బసవరాజుకు చేరింది. దీనితో కుమార్తెను బుజ్జగించాడు. ఆమెపై పెట్టుకున్న ఆశలు, భవిష్యత్తు గురించి రాత్రంతా ఏకరవు పెట్టాడు. తన ఆశలన్నీ ఆమెపై పెట్టుకున్నట్లు కన్నీరుపెట్టుకుంటూ చెప్పాడు. అంతా విన్న చైత్ర తండ్రి మాటలను పట్టించుకోలేదు. ఈ నెల 8వ తేదీన ప్రియుడితో పారిపోయి ఓ గుడిలో మూడుముళ్లు వేయించుకుంది.

 
అప్పట్నుంచి 20వ తేదీ వరకూ తండ్రికి ఆచూకి లభ్యం కాకుండా తప్పించుకుని తిరుగుతూ వచ్చారు. ఐతే సోమవారం నాడు మండలంలో రిజిస్టర్ కార్యాలయంలో తమ పెళ్లిని రిజిస్టర్ చేయించుకునేందుకు నూతన దంపతులు వెళ్తున్నారు. సమాచారం అందుకున్న చైత్ర తండ్రి అక్కడికి చేరుకున్నాడు.

 
కుమార్తె మెడలో తాళిని తెంపాడు. విసిరి నేలకేసి కొట్టాడు. కుమార్తె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లసాగాడు. దీనితో ఆమె రక్షించండి... అంటూ కేకలు వేయడం మొదలుపెట్టింది. స్థానికులు ఈ ఘటనతో షాక్ తిన్నారు. ఆ తర్వాత తేరుకుని చైత్రను ఆమె తండ్రి నుంచి విడిపించారు. దాంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి ప్రియుడి చాటుకి చేరింది. ఇద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన తండ్రి వల్ల తమ ప్రాణాలకు ముప్పు వుందని ఫిర్యాదు చేసింది కుమార్తె చైత్ర. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లిబియాలో దారుణం: 160 మంది జలసమాధి.. వలసదారులపై..?