ఈ సమాజంలో బతకాలంటే భయమేస్తుందని, అందుకే ఈ లోకం విడిచిపోతున్నానని, తనను క్షమించాలంటూ తల్లిదండ్రులకు ఓ విద్యార్థి సూసైడ్ లేఖ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ (ఎంఐఎంఎస్) మెడికల్ వైద్య కాలేజీలో చోటుచేసుకుంది. ఆ కాలేజీలో వెస్ట్ గోదావరి జిల్లా నెల్లిమర్లకు చెందిన సాయి మణిదీప్ (24) అనే విద్యార్థి వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. ద్వితీయ సంవత్సరం వైద్య కోర్సు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు.
ఈ క్రమంలోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 'అమ్మానాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది. కష్టపడి చదువుదామంటే నాతో కావడం లేదు. బతకాలంటే భయమేస్తుంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్ళుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు' అంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకున్నాడు. తాను ఉండే కాలేజీ హాస్టల్‌లోనే బలవన్మరణానికి పాలపడ్డాడు. మణిదీప్ ఆత్మహత్య, సూసైడ్ లేఖ స్థానికంగా సంచలనంగా మారింది.
ఫోన్ గిఫ్ట్‌గా ఇంటికి పంపించి.. స్మార్ట్‌గా రూ.2.8 కోట్లు స్వాహా
సైబర్ నేరగాళ్లు కొత్తకొత్తగా ఆలోచన చేస్తున్నారు. అధునాత టెక్నాలజీని ఉపయోగించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోనును బహుమతిగా పంపించి రూ.2.8 కోట్లను కాజేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
బెంగళూరు నగరానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతడికి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీశామని, మీరు స్మార్ట్‌ఫోన్ గెలుచుకున్నారని చెప్పారు. అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియరులో నిజంగానే మొబైల్ ఫోనును పంపించారు.
కొత్త ఫోన్.. అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. తన పాత ఫోన్‌లోని సిమ్ తీసి కొత్త ఫోనులో వేసి వాడడం మొదలుపెట్టాడు. సిమ్ వేసిన గంటలో చాలా మెసేజ్‌లు, ఓటీపీలు వచ్చినా కొత్త ఫోను కావడం వల్ల వస్తున్నాయని పట్టించుకోలేదు.
అయితే, అప్పటికే ఆ ఫోనును తమ నియంత్రణలోకి తీసుకున్న స్కామర్లు.. సదరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బ్యాంకు ఖాతా వివరాలు తస్కరించి పాస్‌వర్డ్‌లు మార్చేశారు. ఆపై అతడి ఖాతాలో ఉన్న రూ.2 కోట్ల 80 లక్షలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది.