Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా దుప్పట్లో చుట్టి

Advertiesment
deadbody
, బుధవారం, 3 మే 2023 (15:41 IST)
కడప జిల్లాలో ఓ అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయిన కన్నతండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాల్సిన కుమారుడు.. ఆ పని చేయకుండా, శవాన్ని దుప్పట్లో చుట్టి చెట్ల పొదల్లో విసిరేశాడు. కొద్ది రోజుల తర్వాత కుళ్లిన శవం వాసన రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. 
 
ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని దువ్వూరు మండలం సింగనపల్లెకు చెందిన బొమ్ము చిన్నపుల్లారెడ్డి (62) అనే వ్యక్తి కుమారుడు రాజశేఖర్‌ రెడ్డి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్‌‌గా పని చేస్తున్నాడు. చిన్నపుల్లారెడ్డి కొన్నేళ్లుగా క్షయతో బాధపడుతుంటే కడప సమీపంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించిన రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అదే నెల 23న రాజశేఖర్‌ రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. వైద్య సిబ్బంది చిన్నపుల్లారెడ్డిని డిశ్చార్జి చేయగా... ఆసుపత్రి దగ్గరే ఆయన మృతి చెందాడు. 
 
తండ్రి మృతదేహానికి ఆసుపత్రికి చెందిన దుప్పటిని చుట్టిన రాజశేఖర్‌ రెడ్డి... ఓ ఆటోను బాడుగకు మాట్లాడుకుని అందులోకి చేర్చాడు. మార్గంమధ్యలో గువ్వల చెరువు ఘాట్‌ రోడ్డులోకి తీసుకెళ్లి పొదల్లో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో గత నెల 29న పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. వారు గాలించి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు.
 
సంఘటన స్థలంలో ఉన్న దుప్పటిపై లోగోను పరిశీలించిన పోలీసులు... ఆసుపత్రికి వెళ్లి విచారించగా విషయం బయటపడింది. అంత్యక్రియలకు డబ్బుల్లేకనే మృతదేహాన్ని పడేసినట్లు నిందితుడు చెప్పాడు. తండ్రి మృతదేహాన్ని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన రాజశేఖర్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అంటే ఇదే...