గుజరాత్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని బొటాడ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని భగవాన్‌పొరా ప్రాంతంలో సంక్రాంతి పండుగ రోజున ఓ బాలిక తన ఇంటి పక్కన పడిన గాలిపటాన్ని తెచ్చుకునేందుకు సాయంత్రం 4.30 గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బాలిక కోసం తల్లిదండ్రులు ఎంతో గాలించారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఒక నిర్మానుష్య ప్రాంతంలో అర్థనగ్నంగా ఉన్న బాలిక శవాన్ని గుర్తించారు. కామాంధులు బాలిక నోట్లో ప్లాస్టిక్ కవర్లు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
దీంతో బాలిక కటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒక చోట చేరి ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కాగా బాలిక శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.