తమిళనాడులోని తెన్‌కాశిలో ఒళ్లు గగుర్పొడిచే హత్య జరిగింది. భార్యాభర్తలు ఇద్దరూ ఓ షాపుకి వెళ్లి నడిచి వస్తుండగా వారిని అడ్డగించారు నలుగురు వ్యక్తుల గ్యాంగ్. అనంతరం నలుగురూ కలిసి భార్యాభర్తల్లో భార్యను పక్కకు నెట్టి ఆమె భర్త తల నరికేసారు. ఈ హఠత్పరిణామానికి అతడి భార్య భీతిల్లిపోయింది.
ఆమె కేకలు వేసి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసే లోపుగానే దుండగులు నరికిన తలను తీసుకుని వెళ్లిపోయారు. సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న ఓ గుడి ద్వారం ముందు విసిరేసి వెళ్లిపోయారు. ఈ దారుణానికి పాల్పడిందెవరన్నది తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడి తల కోసం గాలించగా కాశిమజోర్పురం లోని దేవాలయం ముందు వున్నట్లు కనుగొన్నారు.
తలను స్వాధీనం చేసుకుని మృతుడి మొండెంను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడుగా వున్నట్లు వెల్లడైంది. ఓ యువకుడిని హత్య చేసి అతడి తలను అదే గుడి వద్ద పడేసిన ఆరోపణల్లో మృతుడు నిందితుడుగా వున్నాడు.