ఏలూరులో దారుణం జరిగింది. అర్థరాత్రివేళ ఇద్దరు రౌడీషీటర్లు ఓ ఇంటి తలుపులు బద్ధలుకొట్టి ఇంట్లో వున్న ఓ యువతిని బైటకు ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ యువతి ఏలూరులో వుంటున్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. డిసెంబరు 2న స్నేహితురాలి కుటుంబం తిరుపతి వెళ్లారు. దాంతో ఆ ఇంట్లో ఈ ఇద్దరు యువతులు మాత్రమే వున్నారు. ఇది గమనించిన రౌడీషీటర్లు అర్థరాత్రివేళ పూటుగా మద్యం సేవించి వారి ఇంటికి వచ్చారు.
తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. కేకలు వేస్తున్న యువతులను గట్టిగా అరవొద్దంటూ బెల్టు తీసుకుని చితకబాదారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిన యువతిని సమీపంలోని సచివాలయం ప్రాంగణంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించి వెళ్లిపోయారు. డిసెంబరు 3 తెల్లవారు జామున ఇద్దరు బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తొలుత స్పందించని పోలీసులు గురువారం నాడు కేసు నమోదు చేసారు.