కర్నాటక లోని దేవనగరిలో దారుణం చోటుచేసుకున్నది. కన్నబిడ్డల ఎదుటే ఓ తల్లిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హరప్పనహల్లిలో కొలువై వున్న ఉచ్చెంగిదుర్గ అమ్మవారిని తన ఇద్దరు బిడ్డలతో కలిసి దర్శించుకునేందుకు మార్చి 31న వచ్చింది ఓ మహిళ. అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు పూజలు ముగించుకుని ప్రసాదం తీసుకుని ఏప్రిల్ 4 రాత్రి తన ఊరికి బయలుదేరే సమయానికి కాస్త టైం అయ్యింది. రోడ్డుపై ఇద్దరు పిల్లలతో నిలబడి వున్న మహిళను చూసిన ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ బస్సు ఆపాడు. బస్సు అటే వెళ్తుంది ఎక్కమని చెప్పాడు. తన ఇద్దరి పిల్లలతో బస్సు ఎక్కింది మహిళ. బస్సులో ఏడెనిమిది మంది ప్రయాణికులు మాత్రమే వున్నారు.
కొంతదూరం ప్రయాణించాక బస్సులో వున్న ప్రయాణికులు దిగిపోయారు. మరో అర్థగంటలో తను గమ్యం చేరాల్సిన దేవనగరి పట్టణం వస్తుంది. ఐతే... ఈలోపు బస్సు డ్రైవర్ చెన్నపుర గ్రామం వైపు నిర్మానుష్య ప్రాంతానికి బస్సును తీసుకెళ్లాడు. అక్కడ బస్సు ఆపాడు. డ్రైవరుతో పాటు కండక్టర్, క్లీనర్ అంతా కలిసి పిల్లలిద్దరి చేతులు, కాళ్లు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కారు. ఆ తర్వాత వారి కళ్లెదుటే వారి తల్లి పైను ముగ్గురు వరుసగా అత్యాచారం చేసారు. తనను రక్షించండి అంటూ ఆమె కేకలు పెట్టడంతో సమీపంలో పొలంలో ధాన్యం వద్ద కాపలాగా వుండే రైతులు పరుగు పరుగున బస్సు వద్దకు వచ్చారు.
మహిళపై అఘాయిత్యం చేసిన కామాంధులు ముగ్గురికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఐతే పోలీసులు కేసు నమోదు చేయకపోగా బాధితురాలికి 2 వేల రూపాయలు ఇచ్చి చిరిగిన వస్త్రాలను పడేసి కొత్తవి కొనుక్కోమని చెప్పారు. అత్యాచారం విషయాన్ని ఎవరికీ చెప్పవద్దనీ, చెబితే నీకే నష్టం జరుగుతుందని బాధితురాలిని తిరిగి అమ్మవారి ఆలయం వద్ద దిగబెట్టి వెళ్లిపోయారు. ఐతే అత్యాచారం చేసిన నిందితులపై చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై రైతులు ప్రశ్నించడంతో పోలీసులు బుక్కయ్యారు. విషయం కాస్తా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి నిందితులు ముగ్గుర్ని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.