రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గిరిధర్ వర్మ అనే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని కొరిటపాడుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుంటూరుకి చెందిన వెంకటరెడ్డి నుంచి రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. పూర్తిగా డబ్బు చెల్లించినా ఇంకా తనకు డబ్బు ఇవ్వాలనీ, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని వెంకటరెడ్డి బెదిరిస్తున్నాడంటూ లేఖలో పేర్కొన్నాడు.
అతడి వేధింపులు తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాననీ, తనకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ఆ తర్వాత అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్మ మూడు నెలల క్రితం హైదరాబాదు కుషాయిగూడ లోని ఆదిత్యనగర్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని వుంటున్నాడు. బంధువులతో భోజనం చేసాక ఇంటికి వెళ్లి తెల్లారేసరికి చనిపోయి కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.