దేశ రాజధాని ఢిల్లీ శివారులో నెల రోజుల క్రితం సంచలనం సృష్టించిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మృతురాలి ముక్కుపుడక ఆధారంగా పోలీసులు ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీ వీడింది. పైగా, ఈ మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు మృతురాలి భర్తేనని తేలింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే,
గత మార్చి నెల 15వ తేదీన ఢిల్లీలోని ఓ మురుగు కాలువలో బెడ్‌షీట్‍తో చుట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం నీటిలో మునిగివుండలా ఓ సిమెంట్ బస్తాను కట్టారు. దీనిపై పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ జరిపారు. మృతురాలి ముక్కుపుడకను సేకరించిన పోలీసులు.. దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
మృతురాలి ముక్కుపుడక సౌత్ ఢిల్లీలోని ఓ నగల దుకాణంలో కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దుకాణంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించగా, ఆ ముక్కుపుడక ఢిల్లీకి చెందిన ప్రాపర్టీ వ్యాపారి అనిల్ కుమార్ కొనుగోలు చేసినట్టు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అనిల్ కుమార్ మృతురాలు తన భార్య సీమా సింగ్ (47) అని అంగీకరించాడు. ఆమె కొన్ని రోజుల క్రితం ఫోను లేకుండా బృందావన్ వెళ్లిందని చెప్పడంతో అనుమానం మరింత బలపడింది.
ద్వారకాలోని అనిల్ కుమార్ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేయగా, అతడి అత్తగారి నంబర్‌తో పాటు కుటుంబ సభ్యుల వివరాలు లభించాయి. కుటుంబ సభ్యులను సంప్రదించగా మార్చి 11 నుంచి సీమా సింగ్ ఎవ్వరితోనూ మాట్లాడేదని స్పష్టం చేసింది. అనిల్ కుమార్ ఆమె జైపూర్‌లోని ఆరోగ్య చికిత్స తీసుకుంటోందని, అందుకే మాట్లాడటం లేదని కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేశాడు.
అయితే, ఏప్రిల్ ఒకటో తేదీన కుటుంబ సభ్యులు సీమా సింగ్ మృతదేహాన్ని అధికారికంగా గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ కేసులో అనిల్ కుమార్‌తో పాటు అతడి సెక్యూరిటీ గార్డు శివ శంకర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మిస్టరీగా మారిన మహిళ మృతి కేసులో ప్రధాన నిందితుడు భర్తే అని తేలింది.