ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లోనే రికార్డు నెలకొల్పిన ఇమ్రాన్ తాహిర్

గురువారం, 30 మే 2019 (18:41 IST)
2019 క్రికెట్ ప్రపంచకప్‌ ఆరంభం అదిరింది. ఇంగ్లాండ్‌ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఓవల్‌ వేదికగా జరిగిన తొలిపోరులో దక్షిణాఫ్రికా స్పిన్‌బౌలర్ ఇమ్రాన్‌ తాహిర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. 1975 నుంచి ఇప్పటివరకు అన్ని ప్రపంచకప్‌లలో ఏ స్పిన్‌బౌలర్‌కు దక్కని అరుదైన అవకాశం అతడికి దక్కింది. ఏ ప్రపంచకప్‌లో కూడా తొలి మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం స్పిన్నర్లకు దక్కలేదు. అయితే ఈ ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో తొలి ఓవర్‌ స్పిన్నర్‌ అయిన ఇమ్రాన్‌ వేయడంతో కొత్త రికార్డు నెలకొల్పాడు.
 
ఆతిథ్య జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఫా డు ప్లెసిస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 1975 నుంచి వస్తున్న ఆనవాయితీకి  ఫా డు ప్లెసిస్‌ తెరదించుతూ తొలి ఓవర్‌ వేసేందుకు స్పిన్‌బౌలరైన ఇమ్రాన్‌ తాహిర్‌కు డుప్లెసిస్‌ బంతి ఇచ్చాడు. కెప్టెన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తాహిర్‌ తొలి ఓవర్‌ రెండో బంతికే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టోని గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున తాహిర్‌ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌స్టో కూడా తన బ్యాట్‌తో మెరిపించాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం క్రికెట్ లవర్స్ కోసం బీబీసీ ప్రపంచ కప్ ప్రత్యేక కవరేజ్