ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులోభాగంగా, మంగళవారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంటుంది. బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్ జీవన్మరణ సమస్యలాంటిది.
అయితే, భారత్ - బంగ్లాదేశ్ జట్లూ ఇప్పటివరకు మొత్తం 35 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో 29 సార్లు భారత్ గెలుపొందగా, ఒక్క మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. బంగ్లాదేశ్ మాత్రం ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది.
ఈ గణాంకాలను పరిశీలిస్తే భారత్‌దే పైచేయిగా ఉంది. అలాగే, మంగళవారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే మ్యాచ్‌లో కూడా కోహ్లీ సేనకే అత్యధిక విజయావకాశాలు ఉన్నాయి. అంటే భారత్‌కు 83 శాతం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండగా, బంగ్లాదేశ్‌కు మాత్రం కేవలం 17 శాతం మాత్రమే ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.