ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు మాంచెష్టర్ వేదికకానుండగా, భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ పోటీ హోరాహోరీగా సాగనుంది. నిజానికి లీగ్ దశలో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది. కానీ, సెమీ ఫైనల్‌లో మాత్రం ఈ రెండు జట్లే తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో భారత్ ఆగ్రస్థానంలో ఉండటం, న్యూజిలాండ్ చివరి స్థానంలో స్థానంలో ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
అయితే, ఈ మ్యాచ్ జరిగే పిచ్ స్పందిస్తున్న తీరును బట్టి టాస్ గెలిస్తే భారత్ ముందు బ్యాటింగ్ తీసుకోవడం మేలు. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ టీమ్ ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 323గా ఉండడం విశేషం. అంటే ఈ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉండనుంది. అయితే మ్యాచ్ సాగిన కొద్దీ చివర్లో పరుగులు రావడం కష్టమవుతుంది కాబట్టి ఓపెనర్ల సూపర్ ఫామ్ కీలకం కానుంది.
మరోవైపు, ఇంగ్లండ్ గడ్డపై కివీస్‌తో ఆడిన ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఇరుజట్ల మధ్య ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు జరిగాయి. అన్నింట్లో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగి ఓడిపోయింది. చివరిసారిగా ఈ దేశంలో 1999 ప్రపంచకప్‌లో కివీస్‌తో తలపడింది. అయితే, కివీస్ ఇప్పటివరుక ఏడుసార్లు ప్రపంచ కప్ సెమీస్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడితే ఒక్కసారి (2015) మాత్రమే గెలిచింది. భారత్ మాత్రం ఆరు సార్లు సెమీస్‌లో అడుగుపెట్టి.. మూడుసార్లు నెగ్గింది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచింది.
అంతేకాకుండా, 2003 తర్వాత ప్రపంచ కప్ సెమీస్ పోరులో భారత్, కివీస్ జట్లు తలపడనుండట ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఓవరాల్‌గా ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య మొత్తం 101 మ్యాచ్‌లు జరిగితే, భారత్ 55 మ్యాచ్‌లలో, కివీస్ జట్టు 45 మ్యాచ్‌లలో గెలుపుబావుటా ఎగురవేసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. సెమీస్ మ్యాచ్ జరిగే ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ బ్యాటింగ్‌కు అద్భుతంగా సహకరిస్తుంది. బౌండరీ లైన్ దూరంగా ఉండటంతో స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.