Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అత్యుత్తమ మేటి జట్టు టీం ఇండియానే : మురళీ

అత్యుత్తమ మేటి జట్టు టీం ఇండియానే : మురళీ
ప్రస్తుతం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో టీం ఇండియా మూడో స్థానంలో ఉన్నప్పటికీ... తన దృష్టిలో మాత్రం అన్ని పరిస్థితుల్లోనూ టీం ఇండియానే అత్యుత్తమ మేటి జట్టు అని శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ కితాబిచ్చాడు.

లంక-భారత్‌ల నడుమ జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో చివరి వన్డేలో గెలుపు తమకెంతో ఊరటనిచ్చిందనీ, కానీ ఈ సిరీస్‌లో భారత్ చేతిలో అన్నిరంగాల్లోనూ ఓడిపోయామని... మురళీ వ్యాఖ్యానించాడు. ఈ పరిణామం లంక అభిమానులతోపాటు తమనీ ఎంతగానో నిరాశపరచిందనీ, ఐతే ప్రపంచంలో అత్యుత్తమ మేటి వన్డే జట్టు చేతిలో పరాజయం పొందామన్న సంగతిని మరచిపోరాదని అన్నాడు.

అన్ని రకాలుగా మంచి ఊపులో ఉన్న టీం ఇండియా ఆస్ట్రేలియా సొంతగడ్డపైనే ఆసీస్‌ను మట్టిగరిపించిందనీ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక దక్షిణాఫ్రికా కూడా ప్రపంచ క్రికెట్‌లో వేగంగా దూసుకెళ్తోందనీ, ఉపఖండంలో సత్తా చాటిన తరువాతనే వాళ్లు నంబర్‌వన్ ర్యాంకుకు అర్హత సాధిస్తారని అన్నాడు.

ఇక టీం ఇండియా విషయానికి వస్తే... బ్యాటింగ్ అత్యద్భుతంగా ఉందనీ, బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా కనిపిస్తోందనీ, టాప్ ఆర్డర్‌లో అత్యుత్తమ ఆటగాళ్లున్నారని మురళీ మెచ్చుకోలుగా అన్నాడు. అలాగే, స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో టీం ఇండియా బౌలర్ల ఘనత ఏపాటిదో అందరికీ తెలిసిందేనని, ఇక యువ ఆటగాళ్లలో సత్తాకు ఏ మాత్రం కొదవలేదని ప్రశంసల జల్లు కురిపించాడు.

ఎలాంటి సమయంలోనైనా బంతిని బౌండరీలకు తరలించగల సామర్థ్యం టీం ఇండియా సొంతమనీ, దానికి తోడుగా ప్రశాంత స్వభావం కలిగిన కెప్టెన్ ధోనీతో మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా తయారైందనీ మురళీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ, ఆధారపడదగిన ఫినిషర్ కూడా ధోనీయేననీ అన్నాడు.

ఇక ఈ సిరీస్‌లో తాము కొన్ని పొరపాట్లు చేశామనీ, వాటి నుంచి పాఠాలు నేర్చుకుని పటిష్టమైన స్థాయికి చేరుకుంటామని మురళీ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌తో సమవుజ్జీ స్థాయికి చేరుకోవాలంటే, ఖచ్చితంగా మరికొంత సమయం పడుతుందని అన్నాడు. ప్రస్తుతం టీం ఇండియా అత్యున్నత శిఖరంపైన ఉందనీ, భారత్‌ను ఓడించాలంటే, ఏ జట్టైనప్పటికీ అసాధారణ క్రికెట్ ఆడక తప్పదని మురళీ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu