Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెర్తాయనమః

Advertiesment
పెర్తాయనమః
, మంగళవారం, 22 జనవరి 2008 (15:53 IST)
-రాజశేఖర్
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ....

మానవ అనుభవ సారాన్ని అత్యద్భుతంగా తాత్వీకరించిన ఈ పద్యం ఇప్పుడు మన పాఠశాల పిల్లలకు చెబుతున్నారో లేదో తెలీదు. కానీ, మొన్న పెర్త్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు జరిగిన జీవిత కాల పరాభవాన్ని చూశాక, చదివాక ఈ పద్య సారాంశం మరింత మహత్తరంగా బోధపడింది. క్రికెట్‌లో జయాపజయాలు ఎవరికయినా, ఏ జట్టుకయినా సహజమే కాబట్టి పెర్త్‌లో ఆసీస్ పరాజయాన్ని ఆటలో భాగంగానే చూడాలనడంలో అభ్యంతరకరమైన విషయం ఏమీ లేదు. కాని ఆటను యుద్ధంగా, గెలిచి తీరాల్సిన అనివార్య పోరుగా చూసేటవ్పుడు భారత్ విజయం కాని, ఆసీస్ పరాభవం కాని తాత్వికంగా మనకు బోధపరుస్తున్నదేమిటి?

ఉపఖండంలోనే కాదు క్రికెట్ ప్రపంచం ఎన్నాళ్లు గానో ఎదురుచూస్తున్న, కాంక్షిస్తున్న ఒకానొక మేటి ఘటనను భారత క్రికెట్ జట్టు మరోసారి పెర్త్‌లో లిఖించింది. పదే పదే తన విజయోన్మత్త మదగర్వంతో క్రికెట్ ప్రపంచాన్ని ప్రవర్తనతో కాక పొగరుతో శాసిస్తున్న ఒక దురహంకార శక్తికి జీవితంలో మర్చిపోలేని పరాభవం పెర్త్‌లో ఎదురైంది.

పెర్త్‌లో ఆసీస్ జట్టుకు ఏమైంది? తత్వశాస్త్రం తనదైన పాఠాన్ని నేర్పిందంతే.. నేను బలవంతుడిని... మాది ప్రొఫెషనల్ జట్టు...అలవోక విజయాలను ఆస్వాదించడమే మా తత్వం...మైదానంలోనే కాదు ఇతర సందర్భాల్లో కూడా విజయ గర్వాన్ని ప్రదర్శించడం మా జన్మహక్కు అంటూ గత దశాబ్దంపైగా విర్రవీగిన అహంకారికి తత్వశాస్త్రం మర్చిపోలేని పాఠం నేర్పింది..

మొదట్లో ప్రస్తావించిన పద్యభాగాన్ని చూద్దాం. "బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా" వినయాన్ని, ఒదిగి ఉండడాన్ని, అణకువను కాలంచెల్లిన అసమర్థ ప్రతీకలుగా లెక్కిస్తున్న ప్రస్తుత కాలంలో పై లక్షణాలు సర్వకాలాలకూ శిరోభూషణాలే అని సుమతీ శతక పద్యం ఎంత గొప్పగా మనముందు ఆవిష్కరించింది!

పెర్త్‌లో జరిగిన ఆ చిరస్మరణీయ ఘటనను తత్వశాస్త్రం సాధించిన ఘనవిజయంగా చూడాలి. అవతలివాడు పొగరెక్కిన దున్నపోతే కావచ్చు (తత్వాన్ని పచ్చిగా గ్రామీణ వ్యావహారికంలో వర్ణిస్తే ఇలాగే ఉంటుంది), కన్ను మిన్నూ కానకుండా, వ్యవహరిస్తే, పొగరు నెత్తికెక్కితే, విజయం కోసం ఏ అక్రమ మార్గాలకైనా సై అంటే అందుకు శృంగభంగం పెర్త్‌లా ఉంటుంది.

పై పద్యంలో లాగా భారత్ ఇక్కడ చలిచీమల స్థాయిలో ఉండకపోవచ్చు.. గతంలోనూ 17 విజయాల రికార్డును ఆసీస్‌నుంచి అమాంతంగా కలకత్తాలో లాగేసుకున్న చరిత్ర భారత్‌దే మరి. కాని సిడ్నీలో జరిగిన అంపైరింగ్ అవమానాలపై, అనైతిక విజయం పట్ల ఆసీస్ కెప్టెన్‌తో సహా ఆ జట్టు సభ్యుల "స్వచర్మ సమర్థన"పై భారత్ తీసిన చావుదెబ్బే పెర్త్ ఘటన.

అనైతికంగా ఓడినా, మైదానంలో పదే పదే అవమానాలకు గురైనా, న్యాయమూర్తులే ఏమరుపాటుతో లేదా ఉద్దేశ్యపూర్వకంగా ధర్మాతిక్రమణ చేసినా, నీలో నైతిక ధృతి సడలకుంటే, ఐక్యత ఉంటే, వనరులను సరిగా ఉపయోగించుకుంటే...శక్తులను కేంద్రీకరిస్తే, గెలుపుకోసం కాకుండా మదినిండా స్పూర్తి మంత్రాన్ని ఒక జట్టు ఏకత్రాటితో జపిస్తే ఏ శక్తి ఆపగలదు?

భారత్ అదే చేసింది..అవమానకర ఓటమికి కృంగిపోని తత్వంతో శక్తిని కూడదీసుకుంది. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని నిర్ణయించుకుంది. ఎక్కడ ఆసీస్ అప్రతిహత విజయాల రికార్డు ప్రపంచ క్రీడా చిత్రపటంలో తిరుగులేకుండా మూడు దశాబ్దాలుగా లిఖించబడుతోందో, ఎక్కడ తన మాటకు చేతకు ఎదురులేదని ఆసీస్ విర్రవీగిందో అక్కడే భారత్ కుళ్లబొడిచింది.

ప్రపంచ చరిత్రకేసి చూస్తే ఒక చిన్న సైన్యం, అప్పటికే శక్తి ఉడిగిపోయినట్లనిపించిన చిన్నసైన్యం తన ఎదురుగా ఉన్న మహాసైన్యంతో తలపడి గెలిచిన ప్రతి ఘటనలోనూ పెర్త్ అనుభవమే మనకు కనిపిస్తుంది. ప్రతి పొగరుమోతుకు తనదైన కాలాంతం ఒకటి ఉంటుంది. సిడ్నీ వరకు విర్రవీగుతూ వచ్చిన ఆసీస్ తన కాలాంతాన్ని పెర్త్‌లో రాసుకుంది అంతే...

అంతమాత్రాన ఆసీస్ పని అయిపోయినట్లే అని ఎవరికీ భ్రమలు లేవు..విజయం తప్ప మరేదీ తలకెత్తుకోని ఆ జట్టు స్థాయిని ఆటలో (ప్రవర్తనలో కాదు) అందుకోవాలంటే ప్రతి కక్షులు ఎంతగా ఎదగాలో అందరికీ తెలుసు. కాని వెయ్యి గొడ్లను తిన్న రాబందుకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంధి దశలో తాత్కాలికంగా అయినా సరే మరణశాసనం ఎదురవక తప్పదు. అదే పెర్త్.

మనిషి అనుభవాల సారాంశాన్ని ఎన్ని సార్లు మనం చదువుకోలేదు? గడ్డిపోచలు మహా ఏనుగునే నిలవరించే ఘటనలు, తలలను పంజాతో పగులబెట్టుకోవడమే పనిగా పెట్టుకున్న పెద్ద పులిని లేగదూడలు కలిసికట్టుగా కుళ్లబొడిచిన ఘటనలు, అంతటి మహావృక్షం సైతం కేంద్రీకృతమైన పెనుగాలి తాకిడికి కూకటి వేళ్లతో సహా కూలిపోయిన ఘటనలు ఎన్ని మనం కథల్లో చదవలేదు?

ఇవన్నీ కలిస్తే ఒక పెర్త్ అవుతుంది. మూడ్రోజుల్లో భారత్ పని పట్టేస్తాం అంటూ విర్రవీగిన గర్వాంధకారాన్ని నాలుగురోజుల్లో నేల కూల్చి అహంకారానికే పాఠం నేర్పిన ఘటనకు తాత్విక నిరూపణే పెర్త్. అందుకే రణతుంగ మొదలు పసిపిల్లాడి వరకు ఆసీస్ పరాజయానికి పండగ చేసుకోవడం, సంబరపడడం. అప్రతిహత విజయాల జట్టు నివ్వెరపాటుతో కుప్పగూలిన క్షణాలు మరో సందర్భంలో అయితే దానికి కాసింత సానుభూతిని దక్కిస్తాయి. దక్కించాలి కూడా... పిడుగు పాటుకు గురైనా ప్రపంచంలో ఏ మూలనుంచి కూడా పిసరంత సానుభూతికి సైతం నోచుకోని ఆసీస్ జట్టు ఓడింది ఆటలో కాదు, నైతిక క్రీడాంగణంలో అంటే అతిశయోక్తి కాదు గదా..

బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావడం తథ్యం.. ఇది సుమతీ శతక కారుడు శతాబ్దాల క్రితం అందించిన మానవ అనుభవసారం. తాము చలిచీమలుగా తీసిపారేసిన జట్టు... అదీ పెర్త్‌లోనా భారత్ ఆటలు.. అంటూ విర్రవీగిన జట్టు.. మా గతి ఎవరికీ పట్టకూడదు అనేంత మౌలిక స్థాయిలో తత్వశాస్త్రం చేతిలో చావుదెబ్బ తింది. అందుకే ఇది ఆసీస్ జట్టు గర్వాంధ మదాంధతలకు గుణపాఠం కాదు. విజయాలను ఆస్వాదించండి.. అంతే కాని తలకెత్తుకుని మదించవద్దు. ప్రతి కక్షులను పురుగుల్లా చూడవద్దు. ఏ క్రీడలోనైనా పాటించి తీరవలసిన కనీస క్రీడా సంస్కారానికి దూరం కావద్దు... ఇదీ.. వ్యక్తులుగాను సమూహం గాను మనందరికీ పెర్త్ నేర్పిన గుణపాఠం..మనసారా మనం పెర్త్‌ను గౌరవిద్దాం..

మనిషి ఎన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించినా, మన అవసరం కోసం, మన విజయం కోసం మౌలికమైన మానవీయ విలువలను కిందికి తోసేయవద్దు అనే మానవ సంస్కతీ సంప్రదాయాన్ని సమున్నతంగా నిలబెట్టిన ఆ క్రీడా మైదానానికి శిరసు వంచి నమస్కరిద్దాం..

విజేత భారత్, విజిత ఆసీస్. కాదు కాదు.. విజేత పెర్త్. మానవీయ సంస్కృతిని మళ్లీ నిలబెట్టిన పెర్త్. తల పొగరును కిందికి దించిన పెర్త్. సత్యం ఎప్పటికీ మెజారిటీ చేతుల్లోనే ఉండదు..బలాధిక్యుల చేతిలోనే ఉండదని నిరూపించిన పెర్త్. సత్యం మైనారిటీకి కూడా సొంతమవుతుంది. శక్తిలేని వారి శిరస్సుపై కూడా అది కిరీటధారణ చేస్తుందని చూపించిన పెర్త్. అందుకే పెర్త్‌ను కలకాలం గుర్తుంచుకుందాం. పెర్త్ నిలబెట్టిన మానవ సంస్కృతిని నిలబెట్టుకుందాం. విజేతల స్థానంలో మనం ఉన్నప్పుడు పరాజితులను గౌరవించాలని పెర్త్ నేర్పిన మహనీయ పాఠాన్ని తలకెత్తుకుందాం.

పెర్తాయనమః

Share this Story:

Follow Webdunia telugu