Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంగ్లాండ్ చేతిలో ధోనీ సేన పంబరేగిపోయిందెలాగంటే...?!!

ఇంగ్లాండ్ చేతిలో ధోనీ సేన పంబరేగిపోయిందెలాగంటే...?!!
, మంగళవారం, 23 ఆగస్టు 2011 (19:14 IST)
స్వదేశంలో జరిగిన నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో గెలిచిన ఇంగ్లాండ్ ఆటగాళ్లతో బ్యాటింగ్, బౌలింగ్ సగటుల్లో భారత జట్టు నుంచి సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఒక్కడే పోటీపడ్డాడు. చెరో డబుల్ సెంచరీ, శతకం చేసి 106.60, 84 సగటులతో వరుసగా 533, 504 పరుగులు చేసిన కెవిన్ పీటర్సన్, ఇయాన్ బెల్‌లు బ్యాటింగ్ పట్టికలో తొలి రెండు స్థానాలను పొందారు.

76.83 సగటుతో 461 పరుగులు చేసిన ద్రవిడ్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ద్రవిడ్ టెస్ట్ సిరీస్‌లో మూడు సెంచరీలు చేశాడు. ఒక సెంచరీ చేసి 48 సగటుతో 348 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్, టెస్ట్ ఓపెనర్ అలెస్టర్ కుక్ నాలుగో స్థానంలో ఉన్నాడు.

వందో అంతర్జాతీయ సెంచరీకి అవసరమైన ఒకే సెంచరీని ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో కూడా చేయడంలో విఫలమైన సచిన్ టెండూల్కర్ 34.12 సాధారణ సగటుతో 273 పరుగులు చేసి జాబితాలో ఐదో స్థానంలో నిలిశాడు. రెండు అర్ధ శతకాలు చేసిన సచిన్ సోమవారం ఓవల్ మైదానంలో చేసిన 91 పరుగులే అత్యధికం. కెప్టెన్‌గా లేదా వికెట్ కీపర్‌గా ఎలాంటి అసాధారణ ప్రతిభ చూపని సారధి మహేంద్ర సింగ్ ధోనీ 31.42 సగటుతో 220 పరుగులు చేసి ఎనిమిదో స్థానాన్ని పొందాడు. ధోనీ రెండు అర్ధ సెంచరీలు చేశాడు.

బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు పొందిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ స్టువార్ట్ బ్రాడ్ అత్యధిక గణాంకాలు 6/46తో కలిపి నాలుగు టెస్ట్‌ల్లో 13.84 సగటుతో 25 వికెట్లతో తొలి స్థానాన్ని పొందాడు. బ్రాడ్ పేస్ బౌలింగ్ సహచరులు జేమ్స్ అండర్సన్, టిమ్ బ్రెస్నన్‌లు 21, 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకొన్న బౌలర్ల జాబితాలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.


అత్యంత విజయవంతమైన భారత బౌలర్ అయిన ప్రవీణ్ కుమార్ మూడు మ్యాచ్‌ల్లో 29.53 సగటుతో 15 వికెట్లు తీసుకొని నాలుగో స్థానంలో నిలిశాడు. ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమీ స్వాన్ నాలుగు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీసుకొన్నాడు. ఇషాంత్ శర్మ, శ్రీశాంత్‌లు పేలవమైన 58.18, 61.62 సగటులతో వరుసగా 11, 8 వికెట్లు తీసుకొన్నారు. మొత్తమ్మీద ఏ విభాగంలోనూ టీం ఇండియా ఇంగ్లాండు జట్టుకు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. మైదానంలోకి వెళ్లింది మొదలు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగుతోనూ ఘోరంగా విఫలమైంది. కనీసం రాబోయే వన్డే, టీ-20ల్లోనైనా సత్తా చాటుతారో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu