మొహాలీలో జరుగుతున్న భారత్-ఆసీస్ టెస్ట్ సీరీస్‌లో రెండో టస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ మైఖేల్ హస్సీ, షేన్ వాట్సన్ అర్థశతకాలు సాధించడంతో ఫాలో ఆన్ ప్రమాదంనుంచి గట్టెక్కడానికి ఆసీస్ తన ఆశలను కాస్త నిలుపుకుంది.
ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రా ప్రారంభంలో వడివడిగా వికెట్లు తీసి మిడిలార్డర్‌ను కుప్పగూల్చినప్పటికీ మొదట హస్సీ తర్వాత వాట్సన్ సాధించిన అర్థశతకాలతో ఆసీస్ కాస్త ఊపిరి పీల్చుకుంది. 119 బంతుల్లో టెస్టుల్లో మూడో అర్థ శతకం సాధించిన హస్సీ 54 పరుగుల స్కోరు వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో హాడిన్, మిశ్రా బౌలింగ్‌లో వైట్‌లు వరుసగా 9, 5 పరుగులకే వెనుదిరిగినా వాట్సన్, బ్రెట్‌లీల ప్రతిఘటనతో ఆసీస్ ఫాలో ఆన్ గండం గట్టెక్కే దిశగా సాగుతోంది.
లంచ్ విరాసమయానికి 7వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి ఆశలు వదిలేసుకున్న ఆసీస్ ఈ ఇరువురు ఆటగాళ్ల ప్రతిభతో పుంజుకుని 231 పరుగులు చేయగలిగింది. 85 ఓవర్లు ముగిసేసరికి వాట్సన్ 58, బ్రెట్‌లీ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు.
కాగా భారత్ బౌలర్లలో జహీర్ ఖాన్ 1, అమిత్ మిశ్రా 3, ఇషాంత్ 2, భజ్జీ 1 వికెట్టు పడగొట్టారు.