రెండు అవమానకర ఓటములు పొంది గాయాలు ఇబ్బందిపెడుతున్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌తో రేపు మూడో టెస్ట్ ఆడబోతున్న నేపధ్యంలో భారత జట్టు ప్రఖ్యాత బ్యాట్స్‌మెన్ ఫామ్ తీవ్రమైన ఆందోళన గురిచేస్తున్నది. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 0-2 తేడాతో వెనుకబడివున్న భారత్ ఈ మ్యాచ్‌లో ఓడినట్లయితే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని ఇంగ్లాండ్‌కు కోల్పోవాల్సివస్తుంది. ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకున్న లేదా ఒకటి గెలిచిన అగ్రస్థానాన్ని పొందుతుంది.
ఇంగ్లాండ్ అద్భుత విజయాలు సాధించి ఉత్సాహంతో ఉండగా భారత్ పుంజుకోవడానికి గాయాలు అడ్డంకిగా మారాయి. తాజాగా పేస్ బౌలర్ జహీర్ ఖాన్ చీలమండ, తొడ కండరాల సమస్య కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
బౌలింగ్ వనరులు పరిమితిగా ఉన్న దృష్ట్యా భారత సారధి మహేంద్ర సింగ్ ధోని ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం సాధించి 2-0 లోటును తగ్గించేందుకు ఫిట్‌నెస్ సాధించిన తన డాషింగ్ ఓపెనర్లపై తిరిగి ఆధారపడే అవకాశం ఉంది. ఎడ్జ్‌బాస్టన్ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని భారత జట్టు యజమాన్యం జట్టు కూర్పును చేయాల్సి ఉంటుంది.
ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్, మునాఫ్ పటేల్‌లు పేస్ బౌలింగ్ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకోనుండగా గాయంతో వైదొలగిన హర్భజన్ సింగ్ స్థానంలో లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు అవకాశం లభించనుంది.
అత్యంత విజయవంతమైన భారత్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ జంట ఇప్పటి వరకు 59.18 సగటుతో 3551 పరుగులు చేసింది. పేస్‌కు అనుకూలించే ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై వీరిద్దరి రాణింపుపైనే భారత విజయ అవకాశాలు ఆధారపడి వున్నాయి.
ఇటీవలి చరిత్ర చూస్తే ఓపెనింగ్ జంట విజయవంతం కాకుండా ఏ పర్యాటక జట్టు కూడా ఇంగ్లాండ్‌లో బాగా ఆడలేదు. కాబట్టి భారత తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఈ ఢిల్లీ జంట రాణింపే కీలకం.