మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో తొలిరోజు ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులు సాధించడం ద్వారా భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఆటముగిసే సమయానికి గంగూలీ (54), ఇషాంత్ శర్మ (2)లు క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా తరపున జాన్సన్ మూడు వికెట్లు దక్కించుకోగా బ్రెట్‌లీ, సిడిల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్‌లు శుభారంభాన్నిచ్చారు. దీంతో తొలి వికెట్‌కు భారత్ 70 పరుగులు సాధించింది. ఈ దశలో ఓపెనర్ సెహ్వాగ్ (35) జాన్సన్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ద్రావిడ్‌తో కలిసి ఓపెనర్ గంభీర్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 76 పరుగులు జతచేశారు.
ఈ దశలో ద్రావిడ్ (39) బ్రెట్‌లీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. వెంటన్ గంభీర్ (67) సైతం జాన్సన్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. వీరి తర్వాత జతకలిసిన సచిన్, లక్ష్మణ్‌లు నాలుగో వికెట్‌కు 17 పరుగులు సాధించారు. ఈ దశలో జాన్సన్ బౌలింగ్‌లో లక్ష్మణ్ క్రీజు నుంచి నిష్క్రమించాడు.
అనంతరం వచ్చిన గంగూలీతో కలిసి సచిన్ ఐదో వికెట్‌కు 142 పరుగులు జోడించాడు. ఈ దశలో సిడిల్ బౌలింగ్‌లో సచిన్ ఔట్ అయ్యాడు. తొలిరోజు మ్యాచ్‌లో సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల రికార్డు సాధించడంతో పాటు టెస్టుల్లో 12000 పరుగుల మైలు రాయిని అధిగమించడం విశేషం. అలాగే గంగూలీ సైతం టెస్టుల్లో 7000 పరుగుల మైలు రాయిని అధిగమించాడు.