చండీగఢ్‌లోని మొహాలీ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ సీరీస్ రెండో టెస్టు నాలుగో రోజు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. ఊపు మీద ఉన్నట్లు కనిపించిన ఇంగ్లండ్ జట్టు చివరి వికెట్లను సోమవారం ఉదయం త్వరగానే కూల్చివేసిన భారత్ 25 ఓవర్లలోపే కీలకమైన వికెట్లను చేజార్చుకోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది.
రెండో టెస్టులో మూడోరోజైన ఆదివారం ఆటముగిసే సరికి పీటర్సన్ కెప్టెన్ ఇన్నిగ్స్‌తో కోలుకున్న ఇంగ్లండ్ తొ్లి ఇన్నింగ్స్‌లో 73 ఓవర్లలో ఆరు వికెట్లు కో్ల్పోయి 282 పరుగులు చేసింది. నాలుగోరోజు ఉదయాన్నే హర్బజన్ సత్తా చూపి త్వరత్వరగా మూడు వికెట్లు చేజిక్కించుకోవడంతో ఇంగ్లండ్ జట్టు 302 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
తదనంతరం త్వరత్వరగా పరుగులు తీసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచాలనుకున్న భారత్ 25 ఓవర్లలోపే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి ఆత్మరక్షణలో పడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించిన సెహ్వాగ్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు.
తర్వాత క్రీజులోకి వచ్చిన తొలి ఇన్నింగ్స్ హీరో రాహుల్ ద్రావిడ్ పరుగు చేయడానికి నానా తంటాలు పడి చివరకు 19 బంతుల అనంతరం బ్రాడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. తర్వాత సచిన్ టెండూల్కర్ కూడా ఆండర్సన్ బౌలింగ్‌లో స్వాన్‌కు క్యాచ్ ఇచ్చి 5 పరుగులకే వెనుదిరగడంతో భారత్ రక్షణాత్మక స్థితిలో పడిపోయింది.
రెండో ఇన్నింగ్స్‌లో గంభీర్ 83 బంతుల్లో 27 పరుగులు సాధించి క్రీజులో ఉండగా, వివిఎస్ లక్ష్మణ్ 6 పరుగులతో ఆడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల ఆధిక్యత సాధించిన భారత్ తన మొత్తం ఆధిక్యతను 200కు పెంచుకుంది. పిచ్ అనూహ్యంగా మారుతుండటంతో భారత్ మొత్తం 300 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచినా దాన్ని ఛేదించడం కష్టసాధ్యమనిపిస్తోంది. ఇంగ్లండ్ జట్టులో ఆండర్సన్, బ్రాడ్ చెరొక వికెట్ పడగొట్టారు.