ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అర్థ శతకం సాధించాడు. ఆరంభంలో తడబాటుకు లోనైన భారత్ ఇన్నింగ్స్ నెమ్మెదిగా కుదుటపడింది. ఈ రెండు జట్ల మధ్య మూడో టెస్టు బుధవారం ప్రారంభమైన విషయం తెల్సిందే. టాస్ గెలిచిన భారత కెప్టెన్ కుంబ్లే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంభీర్, సెహ్వాగ్‌లు ఆచితూచి ఆడారు. అయితే.. బ్రెట్‌లీ బౌలింగ్‌లో సెహ్వాగ్ వికెట్ల ముందు ఎల్బీగా చిక్కాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ కూడా తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 27 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన భారత్.. కష్టాల్లో పడింది.
ద్రావిడ్ అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సచిన్ టెండూల్కర్ ఆసీస్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. 91 బంతుల్లో ఎనిమిది ఫోర్ల సాయంతో 50 పరుగులు (నాటౌట్) చేశాడు. మరోవైపు ఓపెనర్ గంభీర్ ఆచితూచి ఆడుతూ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యన్ని నెలకొల్పారు.