మెల్బోర్న్ టెస్టులో భారత్ అద్భుత విజయావకాశాన్ని చేజార్చుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ వైఫల్యమే జట్టు ఓడిపోవడానికి కారణమని టీమిండియా కెప్టెన్ ధోనీ సమర్థించుకున్నప్పటికీ అతని కెప్టెన్సీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంగ్లండ్ గడ్డపై భారత్ చిత్తుగా ఓడిపోవడంతో ధోనీ నిజంగానే అత్యుత్తమ టెస్టు క్రికెట్ కెప్టెనేనా అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంగ్లండ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోవడానికి గాయాలే కారణమని చెప్పి ధోనీ తప్పించుకున్నప్పటికీ, ధోనీ మైదానంలో క్రికెటర్లను నడిపించిన తీరు, బౌలింగ్ మార్పిడి, ఆక్రోషమైన వ్యూహం, ప్రత్యర్థులపై పట్టు సడలిపోవడం వంటి కారణాలే టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలయ్యాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టెస్టు క్రికెట్ మెలకువలకు ధోనీకి ఎలాంటి సంబంధం లేదని వారు చెబుతున్నారు.
ఇంకా లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వంద పరుగులు చేయాలని ధోనీ వ్యూహం ఏమాత్రం బాగోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్.. యువ బౌలర్లతో అద్భుతమైన కెప్టెన్సీ చేస్తుంటే.. మన కూల్ కెప్టెన్ మాత్రం సీనియర్ల బ్యాటింగ్, అద్భుతమైన బౌలర్ల ఆటతీరు జట్టులో ఉన్నప్పటికీ కెప్టెన్సీ విషయంలో విఫలమవుతున్నాడు.
ఇంకా మెల్బోర్న్ టెస్టు జట్టు ఎంపికలో విరాట్ కోహ్లీని ఎంపిక చేయడం ఎంతవరకు న్యాయమని తెలియట్లేదు. సీనియర్లు అయిన సెహ్వాగ్, గంభీర్, రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్‌లకు కష్టతరమైన పిచ్‌లో కోహ్లీ రాణిస్తాడని ధోనీ ఎలా భావించాడో తెలియట్లేదు. కానీ రోహిత్ శర్మ కోహ్లీ స్థానానికి అర్హుడని ఎందరు చెప్పినా ధోనీ కోహ్లీని ఎంపిక చేయడంపై అభిమానులు గుర్రుగా ఉన్నారు.
ఇకపోతే.. మెల్బోర్న్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే సమయానికి భారత్ 51 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే జహీర్ ఖాన్, ఉమేష్ యాదవ్‌ల అద్భుత బౌలింగ్‌తో ఆసీస్ 27 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో ధోనీ వ్యూహమే హస్సీ, పాంటింగ్‌లు భారీ స్కోరు చేసేందుకు దారి తీసింది. ఇంకా ఆసీస్ ఆటగాళ్లకు ఎలాంటి ఒత్తిడి ఇవ్వకుండా వారిని సింగిల్ రన్స్ చేసేలా ధోనీ కెప్టెన్సీ వ్యూహం మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే లక్ష్మణ్, సచిన్ సూచనల మేరకు జహీర్ ఖాన్‌ను ధోనీ బరిలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. 27 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, కివీస్ వంటి మరో జట్టు అయితే, ఆస్ట్రేలియా 70 పరుగులకే కుప్పకూలివుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కానీ దొరికిన మంచి అవకాశాన్ని ధోనీ సేన చేజార్చుకుందనే చెప్పాలి. దీనికంతటికి ధోనీ కెప్టెన్సీనే కారణమని చెప్పాలి. మరి స్వదేశంలో ఉతేకేస్తాం.. విదేశాల్లో మాత్రం అడ్డంగా తేలిపోతామనే టీమిండియా ఆటతీరు, ధోనీ కెప్టెన్సీలో మార్పు.. రెండో టెస్టులో కనిపిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.