మొహాలీ టెస్ట్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చివర్లో కెప్టెన్ ధోనీ మెరుపులు తోడవడంతో భారత్ 450 పరుగుల మైలురాయిని దాటగల్గింది. భారత ఇన్నింగ్స్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఇన్నింగ్స్ ప్రారంభమైన మూడో బంతికే ఓపెనర్ హెడెన్ (0)ను జహీర్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓ వికెట్ నష్టానికి 13 పరుగుల వద్ద కొనసాగుతోంది. కటిచ్ (8), పాంటింగ్ (5)లు క్రీజులో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 311 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 15 పరుగులు జోడించి ఇషాంత్ శర్మ (9) వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్‌శర్మ వికెట్‌ను సిడిల్ దక్కించుకున్నాడు. అటుపై గంగూలీకి తోడు కెప్టెన్ ధోనీ సైతం అర్థ సెంచరీ సాధించడంతో భారత్ స్కోరు 400 దాటింది. ఈ దశలో సెంచరీ హీరో గంగూలీ (102) వైట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
తర్వాత హర్భజన్ (0), జహార్ ఖాన్ (2)లు కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. అటుపై అమిత్ మిశ్రాతో కలిసి సెంచరీ పూర్తి చేయాలనుకున్న ధోనీ (92) సిడిల్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో 469 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
అంతకుముందు ఈ మ్యాచ్‌లో తొలిరోజు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ల శుభారంభానికి తోడు సచిన్ (88) విజృంభించడంతో తొలిరోజు భారత్ భారీస్కోరు దిశగా పయనించింది. తొలిరోజు ఆటలో సచిన్ అత్యధిక టెస్ట్ పరుగుల ప్రపంచ రికార్డును సాధించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా సచిన్ 12000 పరుగుల మైలురాయిని సైతం అధిగమించాడు. సచిన్‌తో పాటు గంగూలీ సైతం టెస్టుల్లో 7000 పరుగుల మైలు రాయిని చేరుకోవడం తొలిరోజు మ్యాచ్‌లో విశేషం.