మొహాలీలో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో 314 పరుగుల వద్ద భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ద్వారా 516 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. దీంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం వికెట్లేమీ నష్టపోకుండా 18 పరుగుల వద్ద కొనసాగుతోంది. ఓపెనర్లు హెడెన్ (10), కటిచ్ (7)లు క్రీజులో ఉన్నారు.
రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు సెహ్వాగ్ (90), గంభీర్ (104)లు రెచ్చిపోవడంతో భారత్ మ్యాచ్ ఫలితాన్ని శాసించే స్థితికి చేరింది. వీరికి తోడు పస్ట్ డౌన్‌లో బరిలో దిగిన కెప్టెన్ ధోనీ (68 నాటౌట్) కూడా విరుచుకుపడడంతో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగుల వద్ద భారత్ తన రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 201 పరుగులను కలుపుకుని 516 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది. ఈ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్ 268 పరుగులకే ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసింది. అయితే ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా ధోనీ మాత్రం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించడానికే నిర్ణయం తీసుకున్నాడు.
ధోనీ తీసుకున్న నిర్ణయానికి బలం చేకూరుస్తూ ఓపెనర్లు విరుచుకుపడడంతో భారత్ 515 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన దశలో ఇన్నింగ్స్‌ని డిక్లెర్ చేసి ఆస్ట్రేలియాకు సవాల్ విసిరింది.