బంతిపై పూర్తిగా నియంత్రణ సాధించిన భారత్ బౌలర్లు ఆదివారం సైతం వికెట్లను పడగొట్టే లక్ష్యసాధనలో ముందడుగు వేయడంతో భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహలీలో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఆసీస్ జట్టు ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది. ప్రస్తుతం క్రీజులో వాట్సన్, బ్రెట్‌లీ ఆడుతుండగా జట్టు స్కోరు ఏడు వికెట్లకు 200 దాటింది.
ఫాంలో ఉన్న మైఖేల్ హస్సీని ఒక అద్భుతమైన బంతితో 54 పరుగులకే భారత్ బౌలర్ ఇషాంత్ శర్మ ఔట్ చేయడంతో ఆసీస్ పరిస్థితి మరింత దిగజారింది. అనుభవంలేని ఆసీస్ మిడిలార్డర్ భారత్ స్పిన్ బౌలింగ్ ధాటికి నిలబడలేకపోవడంతో లంచ్ విరామానికి ముందే ఆసీస్ 174 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
బెంగుళూరు టెస్టులో సెంచరీ సాధించిన ఊపును కొనసాగిస్తున్న హస్సీ టెస్ట్ క్రికెట్లో తన 10వ అర్థ శతకాన్ని సాధించిన తర్వాత ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో మహేంద్ర సింగ్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో ఆసీస్ పతనం మొదలైంది. ప్రారంభంనుంచి ఇషాంత్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ డెలివరీలతో హస్సీతో సహా ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను చికాకు పెట్టాడు.
కాస్సేపటికే హర్భజన్ సింగ్ ఆడుతూ పాడుతూ హాడిన్ పని పట్టాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హాడిన్ వెనుదిరగడంతో ఆస్ట్రేలియా 146 పరుగుల వద్ద ఆరో వికెట్ చేజార్చుకుంది. మరోవైపు అమిత్ మిశ్రా విసిరిన గుగ్లీ దెబ్బకు కేమరూన్ వైట్ బలయ్యాడు. లంచ్‌కు 25 నిమిషాలకు ముందే ఆసీస్ ఏడు వికెట్లు కోల్పోయింది. టెస్ట్ క్రికెట్‌లో మూడో ఇన్నింగ్స్ ఆడుతున్న వాట్సన్ 32 పరుగుల వద్ద ఔటయ్యాడు.
దీంతో మూడేళ్లలో మొదటిసారిగా ఆసీస్ జట్టు ఫాలో ఆన్ ప్రమాదంలో పడబోతోంది. 2005లో టెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్‌తో పోరులో ఆసీస్ పాలో ఆన్ పాలయ్యాక ఇంతవరకు ఇతర జట్లకు మరో అవకాశం ఇవ్వలేదు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే ఇంకా 35 పరుగులు చేయవలసి ఉంది.