ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ గంభీర్ అద్భుతమైన ఫామ్‌తో సెంచరీ సాధించాడు. రెండో రోజున హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్.లక్ష్మణ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
దీంతో భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతూ పటిష్టస్థితిలో ఉంది. అంతకుముందు తొలి రోజున సచిన్ (68) సహకారంతో గంభీర్ రెచ్చిపోయిన విషయం తెల్సిందే. తొలి రోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి గంభీర్ 149 పరుగులతో క్రీజ్‌లో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే లక్ష్మణ్ కూడా అర్థ శతకం (54) పూర్తి చేసుకుని గంభీర్‌కు మంచి సహకారం అందించారు.
గురువారం రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత గంభీర్-లక్ష్మణ్‌లు ఆచితూచి ఆడుతూ స్కోరును పెంచారు. వీరిద్దరు ఇప్పటికే నాలుగో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్ష్మణ్ 171 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 103 పరుగులు చేశాడు.
ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించిన గంభీర్ - లక్ష్మణ్ భాగస్వామ్యాన్ని విడదీయలేక పోయారు. దీంతో ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత ఆటగాళ్ళ పరుగుల వరద పారిస్తున్నారు. ప్రస్తుతం మూడు వికెట్లను మాత్రమే నష్టపోయిన భారత్.. 388 పరుగులు చేసింది.