స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌లో ఆరంభంలో కాస్త తడబడింది. రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ కేవలం 27 పరుగులకే ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (1), రాహుల్ ద్రావిడ్ (11) వికెట్లను కోల్పోయింది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెల్సిందే.
ఈ సిరీస్‌లో భాగంగా బెంగుళూరులో జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, మొహాలీలో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ విజయభేరీ మోగించింది. ఈ నేపథ్యంలో స్పిన్‌కు స్వర్గధామమైన ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మూడో టెస్ట్ బుధవారం ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ అనిల్ కుంబ్లే బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
తన బౌలింగ్ సహచరుడు హర్భజన్ సింగ్ గాయపడటంతో అతని స్థానంలో రెండో టెస్ట్‌లో అమితంగా రాణించిన స్పిన్నర్ అమిత్ మిశ్రాకు తుది జట్టులో చోటు కల్పించారు. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన గంభీర్, సెహ్వాగ్ తొలి రెండు ఓవర్లను ఆచితూచి ఆడారు.
అయితే ఆసీస్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో భారత్ తన తొలి వికెట్‌ను 5 పరుగుల వద్ద కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ద్రావిడ్ (11) జట్టు స్కోరు 27 పరుగుల మీద ఉండగా జాన్సన్ బౌలింగ్‌లో హేడెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లో ఓపెనర్ గంభీర్ (24), టెండూల్కర్ (11) పరుగులతో ఉన్నారు.
మూడో టెస్ట్‌లో బరిలోకి దిగిన తుది జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ జట్టు.. గంభీర్, సెహ్వాగ్, ద్రావిడ్, సచిన్, గంగూలీ, లక్ష్మణ్, ధోనీ, కుంబ్లే, జహీర్, ఇషాంత్, అమిత్ మిశ్రా.
ఆసీస్ జట్టు.. కటిచ్, హేడెన్, పాంటింగ్, హుస్సే, క్లార్కే, వాట్సన్, హ్యాడ్డిన్, వైట్, బ్రెట్ లీ, జాన్సన్, క్లార్క్.