మొహాలీ మైదానంలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని సంపాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ధోనీ ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా బెంగుళూరులో జరిగిన తొలి టెస్ట్ డ్రా అయిన సంగతి తెలిసిందే.
భారత్ విధించిన 516 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే దిశగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి కుదేలయ్యింది. భారత బౌలర్లు హర్భజన్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలు విరుచుకు పడడంతో 195 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో 320 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో క్లార్క్ (69), హడ్డీన్ (37), హెడెన్ (29), జాన్సన్ (26) మాత్రమే ఓ మోస్తరుగా రాణించగా మిగిలిన బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే ఔట్ కావడంతో ఆస్ట్రేలియాకు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో హర్భజన్ మూడు, జహీర్‌ఖాన్ మూడు వికెట్లు సాధించగా ఇషాంత్ శర్మ, అమిత్ శర్మలు రెండేసి వికెట్లు సాధించి ఆస్ట్రేలియాను కోలుకోలేని దెబ్బ తీశారు.
ఓవర్‌నైట్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 141 పరుగులతో ఐదోరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియాను జహీర్ దెబ్బతీశాడు. కేవలం రెండు పరుగుల తేడాతో హడ్డీన్, వైట్, బ్రెట్‌లీల వికెట్లను జహీర్ పడగొట్టడంతో ఆస్ట్రేలియా ఓటమి ఖరారై పోయింది. ఇక చివరగా మిగిలిన రెండు వికెట్లను మిశ్రా పడగొట్టడంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది.
అంతకుముందు ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్‌మెన్ రాణింపుతో 469 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గంగూలీ (102) సెంచరీ సాధించగా ధోనీ (92), సచిన్ (88), గంభీర్ (67), ద్రవీడ్ (39), సెహ్వాగ్ (35)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సిడిల్, జాన్సన్ మూడేసి వికెట్లు సాధించగా వైట్ రెండు, బ్రెట్‌లీ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి వేగంగా వికెట్లు కోల్పోయి 268 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా తరపున వాట్సన్ (78), హస్సీ (54), బ్రెట్‌లీ (35), కటిచ్ (33)లు రాణించారు. భారత బౌలర్లలో మిశ్రా ఐదు వికెట్లు పడగొట్టగా హర్భజన్, ఇషాంత్ శర్మలు రెండేసి వికెట్లు సాధించారు. జహీర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
ఈ దశలో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా భారత కెప్టెన్ ధోనీ మాత్రం రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే సిద్ధమయ్యాడు. భారత రెండో ఇన్నింగ్స్‌లో గంభీర్ (104), సెహ్వాగ్ (90), ధోనీ (68) రాణించడంతో మూడు వికెట్ల నష్టానికి 314 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లెర్ చేయడం ద్వారా భారత్ 516 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందుంచింది.