బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య బెంగుళూరులో జరిగిన మొదటి టెస్ట్ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇరు జట్లు కెప్టెన్లు అంగీకరించడంతో టెస్ట్ డ్రాగా ముగిసినట్టు అంఫైర్లు ప్రకటించారు. మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 177 పరుగులు సాధించింది. గంగూలీ (26), లక్ష్మణ్ (42)లు నాటౌట్‌గా నిలిచారు. భారత్ తొలి ఇన్నింగ్స్ హీరో జహీర్‌ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 193 పరుగులతో ఐదోరోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 228 పరుగుల వద్ద తన రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. తద్వారా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 70 పరుగులు కలిపి 299 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది.
విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద ఓపెనర్ సెహ్వాగ్ (6) వికెట్‌ను భారత్ కోల్పోయింది. అలాగే ద్రవీడ్ (5) కూడా త్వరగా ఔట్ కావడంతో భారత శిభిరంలో ఆందోళన నెలకొంది. ఈ సమయంలో ఓపెనర్ గంభీర్‌కు జత కలిసిన సచిన్ భారత్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు.
ఈ దశలో గంభీర్ (29) సైతం పెవిలియన్ బాట పట్టాడు. అటుపై సచిన్‌కు జతకలిసిన వీవీఎస్ లక్ష్మణ్ సైతం నిదానంగా ఆడడం ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ దశలో సచిన్ (49) ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ క్లిష్టంగా మారింది. అనంతరం బరిలో దిగిన గంగూలీతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన లక్ష్మణ్ డ్రా దిశగా తమ బ్యాటింగ్ కొనసాగించారు.
ఈ టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 430 పరుగులు చేసింది. హస్సీ (146), పాటింగ్‌లు సెంచరీలు సాధించగా కటిచ్ (66) అర్థ సెంచరీ సాధించాడు. భారత్ తరపున జహీర్‌ఖాన్ ఐదు, ఇషాంత్ శర్మ నాలుగు వికెట్లు పటగొట్టగా హర్భజన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 360 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ద్రవీడ్ (51), హర్భజన్ సింగ్ (54), జహీర్‌ఖాన్ (57 నాటౌట్), సెహ్వాగ్ (45)లు మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా తరపున జాన్సన్ నాలుగు, వాట్సన్ మూడు, క్లార్క్ రెండు వికెట్లు తీసుకోగా బ్రెట్‌లీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.