కొచ్చి ఫ్రాంచైజీపై బీసీసీఐ వేటు: కొత్త జట్టు కోసం సన్నాహాలు!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ప్రక్షాళన చర్యలు చేపట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమాలను ఉల్లంఘించిన జట్లపై వేటు వేసేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌తో చేతులు కలిపి ఐపీఎల్‌లోని అవినీతిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్న బీసీసీఐ ఇటీవలే రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లను ఐపీఎల్ నుంచి వెలివేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఇండియన్ ప్రీమియ ర్ లీగ్ (ఐపీఎల్)లో కొచ్చి కథ ముగియడం దాదాపు ఖాయమన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు ఆ ఫ్రాంచైజీలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం ఇప్పటికిప్పుడు సమసిపోయే సూచనలేమీ కనిపించకపోవడం ఒక కారణమైతే.. కొత్త టీమ్ ఎంపికకు బీసీసీఐ అప్పడు ప్రయత్నాలు మొదలెట్టడం మరో కారణమని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఇందులో భాగంగానే నూతన ఫ్రాంచైజీ బిడ్ కోసం ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ గ్రూప్ (ఐఎమ్జీ) పేరు తాజాగా తెరపైకి వచ్చింది.ఐపీఎల్ నాలుగో సీజన్లో ఎలాగైనా ఎనిమిది జట్లను రంగంలోకి దించాలని పట్టుదలతో ఉన్న బీసీసీఐ అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే మరో ఫ్రాంచైజీ బిడ్డింగ్ వేటలో ఉన్న బోర్డు ఆ ప్రయత్నాల్లో సఫలీకృతమైనట్లు సమాచారం. ఐఎమ్జీ సంస్థ బిడ్ వేసేందుకు సిద్ధంగా ఉందని తెలిసింది. ఆ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులు బోర్డుతో అప్పుడే సంప్రదింపులు కూడా జరిపారని తెలిసింది. నవంబర్‌లో జరగాల్సిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం కొచ్చి వివాదం కారణంగా వచ్చే జనవరికి వాయిదా వేసిన బీసీసీఐ.. మరోసారి కొచ్చికి ఎంతమాత్రమూ అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా లేదట. ఇక గడువులోపు సమస్య పరిష్కారం కాకపోతే కొచ్చిని రద్దు చేసి.. నూతన ఫ్రాంచైజీకి ఆహ్వానం పలకడం ఖాయమని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. మరోవైపు కొచ్చి ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదని సమాచారం. ఇప్పటికే ఫ్రాంచైజీ భాగస్వామ్య వాటాల విషయమై రెండెజువస్, కార్పొరేట్ గ్రూప్‌ల మధ్య విభేదాలు తెలెత్తిన సంగతి విదితమే. దీంతో కొచ్చి అంతర్గత సమస్యల పరిష్కారానికి బీసీసీఐ నెల రోజుల గడువు ఇచ్చినా.. ఆ అవకాశాన్ని కొచ్చి ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే..!