ఐపీఎల్ సెమీస్‌కు ఒక విజయం దూరంలో సచిన్ సేన..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లో భాగంగా సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ సారథ్యం వహించే ముంబై ఇండియన్స్ ఒక విజయం దూరంలో ఉంది. శుక్రవారం రాత్రి మొహాలీలో జరిగే 41వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో సచిన్ సేన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడుతుంది. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం సాధిస్తే సెమీఫైనల్లోకి అడుగుపెట్టినట్లే..!.ఐపీఎల్ తొలి రెండు సీజన్లలో సెమీఫైనల్ వరకు చేరుకోని ముంబై ఇండియన్స్ మూడో అంచెల పోటీల్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లడం గమనార్హం. పంజాబ్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌తో పాటు ఇంకా ఐదు ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్న ముంబై ఇండియన్స్ జట్టు, ప్రస్తుతం 14పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న ముంబై ఇండియన్స్‌తో తలపడే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐపీఎల్-3లో రాణించలేకపోయింది. ఫలితంగా సెమీఫైనల్ ఆశలను చేతులారా చేజార్చుకుని, ఐపీఎల్ పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఐపీఎల్-3లో పరాజయాల పరంపరను కొనసాగిస్తున్న పంజాబ్ ఆటగాళ్లలో యువరాజ్ సింగ్, సంగక్కర వంటి సీనియర్ ఆటగాళ్ల కంటే ఇర్ఫాన్ పఠాన్ 204 పరుగుల స్కోరును సాధించి, జట్టులోనే అత్యధిక పరుగుల వీరుడిగా నిలబడ్డాడు. దీనిని బట్టి పంజాబ్ బ్యాట్స్‌మెన్ల ఆటతీరు ఏ తరహాలో ఉందనే విషయాన్ని అవగతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలింగ్, బ్యాటింగ్ ధాటికి పంజాబ్ జట్టు తట్టుకోవడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. అయితే సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకోలేని ఆవేదనతో ఉన్న పంజాబ్ కింగ్స్.. ఐపీఎల్-3లో గెలిచిన మ్యాచ్‌ల సంఖ్యనైనా పెంచుకోవాలనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్‌పై గట్టిపోటీని ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.