ఐపీఎల్-3 టైటిల్ సచిన్ టెండూల్కర్ సేనకేనా...!?
అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ.. అరుదైన ప్రపంచ రికార్డులతో యువక్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన టీం ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే తెలియని వారుండరు. అంతర్జాతీయ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా కొనసాగుతున్న లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గ్వాలియర్ గడ్డపై చేసిన ప్రపంచ రికార్డుకు తిరుగేలేదు. దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ గడ్డపై జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించి అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించిన క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్, తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఓ మెరుపు మెరుస్తున్నాడు. తన నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ను తాను ముందుడి నడిపిస్తున్నాడు.వ్యక్తిగతంగానూ తనను తాను మెరుగు పరుచుకుంటూ.. జట్టును కూడా సమర్థవంతంగా నడిపించే సత్తా తనలో ఉందని సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మూడో సీజన్‌లో నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు ఐపీఎల్ మ్యాచ్‌ల్లో, ఆరింటిలో గెలుపును నమోదు చేసుకున్న ముంబై ఇండియన్స్, ఐపీఎల్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మూడో అంచెల పోటీల్లో కేవలం ఒక్క ఓటమిని మాత్రమే చవిచూసిన సచిన్ సేన, 12 పాయింట్లతో అజేయంగా ముందుకు సాగుతోంది. ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లోనే గాకుండా, పరిమిత ఓవర్లలోనూ తాను దిట్టేనని నిరూపిస్తూ.. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెట్ వీరుడిగా టెండూల్కర్ (314) నిలిచాడు.ఐపీఎల్-3 టాపర్‌గా కొనసాగేందుకు.. మాస్టర్ బ్లాస్టర్ అద్భుతమైన బ్యాటింగ్ కారణమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లను హడలెత్తింపజేస్తూ... బంతికి తగ్గట్టు బ్యాట్‌ను కదిలిస్తూ.. గ్రౌండ్ షాట్లతో బౌండరీలను సాధించే సచిన్ టెండూల్కర్ తప్పకుండా, తన జట్టుకు టైటిల్‌ను సంపాదించిపెడుతాడని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. బ్యాట్ స్పీడ్.. అద్భుతమైన టైమింగ్‌తో తాను వ్యక్తిగతంగా తన స్కోరును మెరుగుపరుచుకుంటూ.. జట్టు ఆటగాళ్లకు అండగా నిలుస్తున్న సచిన్ టెండూల్కర్ ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను నెగ్గే దిశగా జట్టును నడిపిస్తున్నాడు. మరి ఒక్కే ఒక విజయం తేడాతో రెండో స్థానంలో ఉన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో పాటు మిగిలిన జట్లతో జరిగే హోరాహోరీ పోరులో సచిన్ సేన రాణించి, ఈసారి టైటిల్‌ను కైవసం చేసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే..!