బెంగుళూరు నాలుగో వన్డేలో ఇంగ్లాండ్ జట్టును టీం ఇండియా మట్టికరిపించింది. బెంగుళూరులో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన డే/నైట్ నాలుగో వన్డేకు వరుణదేవుడు అంతరాయం కలిగించడంతో వన్డే సైతం అభిమానులకు టీ-20 మ్యాచ్ అయింది.
వర్షం మధ్య మధ్యలో వస్తూ పోతుండటంతో మ్యాచ్ సగంలో ఆగిపోయి తిరిగి సాయంత్రం 5.50 గంటలకు ప్రారంభమైంది. దీంతో 22 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 166 పరుగులు సాధించగా, డక్ వర్త్ లూయిస్ ప్రకారం 198 పరుగుల లక్ష్యచేధనలో ఇంగ్లాండ్ తడబడింది. మొత్తానికి భారత్ నాలుగో వన్డేలో 19 పరుగుల తేడాతో గెలుపును సాధించి, సిరీస్‌ను 4-0 తేడాతో సొంతం చేసుకుంది.
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో ఓవైస్‌షా (72), ఫ్లింటాప్ (41) రాణించారు. అయితే కీలక సమయాల్లో భారత్ బౌలర్లు విజృంభించి వికెట్లు పడగొట్టారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ (69), గౌతం గంభీర్ (40) పరుగులతో భారత్ పైచేయిగా నిలిచింది.
వీరూతో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్ 11 పరుగులకే విఫలమయ్యాడు, బెంగళూరు వన్డే మ్యాచ్‌లో సాధించిన 69 పరుగులతో ఆరువేల వ్యక్తిగత స్కోరును దాటిన వీరేంద్ర సెహ్వాగ్‌కు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు" లభించింది.
వర్షం ప్రారంభం కాకముందే 17 ఓవర్లలో భారత్ 106 పరుగులు చేసింది. వర్షం వెలిసిన తర్వాత మ్యాచ్‌ను 22 ఓవర్లకు కుదించడంతో భారత్ చేతిలో 5 ఓవర్లే మిగిలాయి. సెహ్వాగ్, గంభీర్‌ల భాగస్వామ్యంతో భారత్ స్కోరు 166 పరుగులకు చేరింది.
అనంతరం భారత్ రన్‌రేట్ పరిగణనలోకి తీసుకుని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 32 పరుగులు పెంచి ఇంగ్లాండ్ లక్ష్యాన్ని 22 ఓవర్లలో 198 పరుగులు నిర్ణయించారు.
ఇక భారత బౌలర్లలో... జహీర్ ఖాన్, మునాఫ్ పటేల్ చెరో వికెట్ పడగొట్టగా, ఇషాంత్ శర్మ, యూసఫ్ పఠాన్, భజ్జీ, యువరాజ్‌లు ఒక్కో వికెట్ చొప్పున నాలుగు వికెట్లు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్ల సంగతికొస్తే... అండర్సన్, బ్రాడ్, ఫ్లింటాప్, సమిత్, స్వాన్, పీటర్సన్‌లు ఒక్కో వికెట్ చొప్పున ఆరు వికెట్లు పడగొట్టారు.
ఇదిలా ఉండగా... ఈ నెల 26వ తేదీన భారత్-ఇంగ్లాండ్‌ల మధ్య ఐదో వన్డే కటక్‌లో జరుగనుంది.