మొహాలీ టెస్టులో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. చివరి రోజు ఆటలో ఇంకా రెండు సెషన్‌ల ఆట మిగిలి ఉండగానే 320 పరుగుల భారీ స్కోరుతో ఆస్ట్రేలియాను మట్టిగరిపించిన భారత్ 4 సీరీస్‌ల మ్యాచ్‌లో 1-0 ఆధిక్యతతో ముందు నిలిచింది.
జహీర్ వరుసగా మూడు వికెట్లు పడగొట్టడంతో భారత్ చివరి రోజు 18.4 ఓవర్లలో కేవలం ఒకటన్నర గంటలోపే ఆస్ట్రేలియాపై లాంఛనప్రాయంగా విజయం సాధించింది చరిత్ర సృష్టించింది. ఘోరమైన విషయం ఏమిటంటే మొహాలీలో ఆసీస్ అన్నిరంగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి భారత్ చేతిలో భంగపాటుకు గురైంది.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సాధ్యం కానివిధంగా 516 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడంతో ఘోరంగా చేతులెత్తేసింది. ఫ్రంట్ లైన్ ఆటగాళ్లు వరుస కట్టిన క్రమంలో ఆసీస్ లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు చేసేదేమీ లేక విజయాన్ని అలవోకగా భారత్‌కు అప్పగించారు.
ఆసీస్ 195 పరుగులకే చాప చుట్టేయడానికి జహీర్ ఖాన్ విజృంభణ ప్రధాన కారణం. కెరీర్‌లోనే శిఖరాయమాన ఆటతీరు ప్రదర్శించిన జహీర్ ప్రారంభంలోనే ఆసీస్‌ను కోలుకోని దెబ్బతీశాడు. ఫలితం.. ఆసీస్‌పై భారత్‌కు అతిపెద్ద విజయం.
గతంలో 1977లో మెల్‌బోర్న్‌లో ఆసీస్‌పై భారత్ 222 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించిన రికార్డును మొహాలీ తిరగరాసింది.