వాళ్లు తేల్చుకోవడానికి వచ్చారు.. మనవాళ్లు ముందే తెలిపోయారు
విజయం మీద విజయం సాధిస్తూ, సీరీస్‌లకు సీరీస్‌లను చుట్టేస్తూ, ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా కనిపించిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా బాహుబలుల ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయింది.
విజయం మీద విజయం సాధిస్తూ, సీరీస్‌లకు సీరీస్‌లను చుట్టేస్తూ, ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా కనిపించిన టీమ్ ఇండియా ఆస్ట్రేలియా బాహుబలుల ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. స్పిన్‌కి భయపడే జట్టు స్పిన్‌ను అడటం ఇదీ అని ప్రమాణాలను నెలకొల్పి చూపితే, స్పిన్‌లో పుట్టి స్పిన్‌లో పెరిగి, స్పిన్‌ని తాగి బతికే జట్టు బంతి టర్న్ అయితేనే వణుకు వచ్చిన విధంగా టపటపా వికెట్లు రాల్చేసుకుని పెవిలియన్ వైపు దారి పట్టింది. ఇది ప్రత్యర్థి గెలుపే కావచ్చు. కానీ మనవాళ్లు బ్యాటింగులో ప్రమాణాలను పాతాళానికి నెట్టి మరీ ఓడిపోయారు. ఇంత సులువుగా గెలవచ్చా అని ప్రత్యర్థే ఆశ్చర్యపోయిన క్షణంలో ఘోరంగా ఓడటం ఎలాగో భారత్ చేసి చూపించి మరీ పరాజయాన్ని ఆహ్వానించింది.
ప్రత్యర్థిని చితక్కొట్టడమే తెలిసిన జట్టుకు ప్రత్యర్థి చేతిలో చిత్తవడం కొత్తగా అనిపిస్తోంది. వందల పరుగుల ఆధిక్యం అందుకోవడం, ఆ తర్వాత స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పట్టేయడం అలవాటుగా మార్చుకున్న టీమ్ అదే వలలో పడి విలవిల్లాడటం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. గింగిరాలు తిరిగే బంతిని ఎదుర్కొనేందుకు ఇక్కడికి వచ్చే ప్రతీ విదేశీ ఆటగాడు తనదైన స్థాయిలో ఎంతో కొంత సన్నద్ధమయ్యే వస్తాడు. అది ఫలితాన్నిస్తుందా లేదా తర్వాత సంగతి. కానీ స్పిన్ కోసమే తయారయ్యాను అన్నట్లుగా పుణే పిచ్ ఎదురుగా కనిపిస్తుంటే భారత బ్యాట్స్‌మెన్ ఏ రకంగా సిద్ధమయ్యారు దిగ్గజ స్పిన్ బౌలర్ కోచ్‌గా ఉన్న జట్టు స్పిన్‌ను అసలు ఆడలేకపోవడం ఏమిటి
‘భారత్‌లో నేను ఎన్నో టర్నింగ్ ట్రాక్‌లను చూశాను. కానీ ఇలాంటి పిచ్‌ను అసలు ఎప్పుడూ చూడలేదు’... ఈ పిచ్ వల్ల రాబోతున్న ప్రమాదాన్ని రవిశాస్త్రి ముందే ఊహించినట్లున్నాడు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేయగలిగి ఉండి ఆ తర్వాత మూడో రోజు నుంచి పిచ్‌పై స్పిన్ ప్రభావం చూపించడం, మన బౌలర్లు చెలరేగిపోవడం భారత్‌లో సాధారణం. ఈ సీజన్‌లోనైతే అశ్విన్, జడేజాలు ఇలాంటి పిచ్‌లపై వికెట్ల మూటలు కట్టుకున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఇదే ఫార్ములా ముందు చేతులెత్తేశాయి.
కొన్నాళ్ల క్రితం నాగపూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు తరహా నాసిరకం పిచ్‌లు కాకుండా కాస్త జీవం ఉన్న వికెట్‌లు ఉండటంతో ఈ సీజన్‌లో భారత్‌పై ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. అయినా సరే మరోసారి స్పిన్ పిచ్ మంత్రాన్నే జట్టు ఎంచుకుంది. క్యురేటర్‌కు బీసీసీఐ ఏదైనా సూచనలిచ్చిందా లేదా తెలీదు కానీ స్పిన్‌తోనే ఆస్ట్రేలియా పని పట్టేయవచ్చని భారత్ ఆత్మ (అతి)విశ్వాసంతో కనిపించింది. కానీ ఇదే పిచ్‌పై మన బ్యాటింగ్ గురించి మాత్రం పెద్దగా ఆలోచించినట్లు లేదు.
ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌లో అత్యుత్తమ నైపుణ్యం ఉండాలి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ మనోళ్లు అవుటైన తీరు, వారి బలహీనతను బయట పెట్టింది. టర్న్ అవుతున్న బంతిని ఎదుర్కోలేక క్లోజ్ ఇన్ ఫీల్డర్లకే అంతా క్యాచ్‌లు ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లోనైతే ఐదు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి. ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ స్పిన్నర్‌ను స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఒక్కసారి ఎదుర్కోకపోవడం వల్ల కూడా ఈ హఠాత్ పరిణామానికి నిస్సహాయులై చూస్తుండిపోయారు.
సాన్‌ట్నర్, సోధి, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఎవరిలో కూడా బంతిని పెద్దగా టర్న్ చేయగలిగే సామర్థ్యం లేదు. ఓకీఫ్ కూడా గొప్ప స్పిన్నరేమీ కాదు కానీ పిచ్ అతనికి బాగా కలిసొచ్చింది. వరుస విజయాలతో ఊపు మీద ఉండటంతో తమలో ఇంకా బయటపడని లోపాల గురించి టీమిండియా పట్టించుకోలేదు. మొదటి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో కప్పిపుచ్చగలరని భావించినా, అదీ సాధ్యం కాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చూస్తే పిచ్‌లో మాత్రమే సమస్య లేదని, మన ఆటగాళ్లకే చేత కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది.