Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంతి కాదు, బ్యాట్ కాదు. ఫీల్డ్ డిసైడ్ చేసిన గేమ్.. సెమీస్‌లో కోహ్లీ సేన

గెలిస్తే సెమీస్..ఓడితే ఇంటికి.. ఏదో ఒకటి తేల్చుకోవల్సిన కీలక గేమ్‌ని అటు బ్యాటూ తేల్చలేదు. ఇటు బాలూ తేల్చలేదు. ఫీల్డు తేల్చేసింది. దక్షిణాఫ్రికా బలహీనతలను ఫీల్డింగ్‌తో పట్టేసిన టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ సెమీస్‌లోకి ప్రవేశించింది. వరుస రన్ ఔట్

Advertiesment
బంతి కాదు, బ్యాట్ కాదు. ఫీల్డ్ డిసైడ్ చేసిన గేమ్.. సెమీస్‌లో కోహ్లీ సేన
హైదరాబాద్ , ఆదివారం, 11 జూన్ 2017 (23:53 IST)
గెలిస్తే సెమీస్..ఓడితే ఇంటికి.. ఏదో ఒకటి తేల్చుకోవల్సిన కీలక గేమ్‌ని అటు బ్యాటూ తేల్చలేదు. ఇటు బాలూ తేల్చలేదు. ఫీల్డు తేల్చేసింది. దక్షిణాఫ్రికా బలహీనతలను ఫీల్డింగ్‌తో పట్టేసిన టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ సెమీస్‌లోకి ప్రవేశించింది. వరుస రన్ ఔట్లతో, క్యాచ్‌లతో చేతులారా వికెట్లు పోగొట్టుకున్న సఫారీ జట్టు విజయాన్ని తొలి ఇన్నింగ్స్ 35వ ఓవర్‌కే టీమిండియా చేతిలో పెట్టేసింది. దక్షిణాఫ్రికా జట్టును అతి తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన కోహ్లీ సేన 192 పరుగుల విజయలక్ష్యాన్ని ఆడుతూ పాడుతూనే సాధించి సెమీస్ అవకాశాన్ని నిలుపుకుంది. ఇది బ్యాట్‌కి, బంతికి మధ్య జరిగిన పోరుకన్నా ఫీల్డ్‌లో ప్రత్యర్థిని బిత్తరపోయేలా చేసిన అద్బుతమైన గేమ్ ప్లాన్‌తో భారత్ సాధించిన అమోఘ విజయంగా చెపితేనే సమంజసంగా ఉంటుంది.
 
చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.  'నాకౌట్' పోరులో సఫారీలను చిత్తు చేసిన భారత్.. ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత సఫారీలను కూల్చేసిన టీమిండియా.. ఆపై ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేరుకుంది.  భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(78;83 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్స్), విరాట్ కోహ్లి(76 నాటౌట్; 101 బంతుల్లో 7 ఫోర్లు, 1సిక్స్ )హాఫ్ సెంచరీలతో రాణించి జట్టుకు విజయాన్నందించారు. దక్షిణాఫ్రికా విసిరిన 192 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలుత ఇన్నింగ్స్ ను నెమ్మదిగా ఆరంభించిన కోహ్లి అండ్ గ్యాంగ్.. 38.0 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురేసింది.
 
సఫారీలు విసిరిన స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు ఆదిలో పరుగులు చేయడానికి ఆపసోపాలు పడింది. తొలి ఓవర్ ను మెయిడిన్ ఖాతా ప్రారంభించిన సఫారీలు లైన్ అండ్ లెంగ్త్ ధ్యేయంగా బంతులు విసిరారు. ఈ క్రమంలో ఓపెనర్లు శిఖర్ ధావన్- రోహిత్ శర్మలు స్ట్రైక్ రొటేట్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణాఫ్రికా పేసర్లు రబడా, మోర్నీ మోర్కెల్ నుంచి పదునైన బంతులు ఎదురుకావడంతో భారత్ ఆటగాళ్లు సింగిల్స్ కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 
 
రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైన తరువాత క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి కూడా దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డాడు. తొలి పది ఓవర్లలో మూడు మెయిడిన్లు వేసి బౌలింగ్ లో సత్తా చాటుకున్నారు సఫారీలు. అయితే కోహ్లి-ధావన్ క్రీజ్‌లో  కుదురుకున్న తరువాత మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. ప్రధానంగా 20 ఓవర్లు దాటిన తరువాత వీరి విజృంభణ మొదలైంది. ముందు శిఖర్ హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై కోహ్లి అర్థ శతకంతో మెరిశాడు. ఈ జోడి రెండో వికెట్ కు 128 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేయడంతో భారత్ గెలుపు సులువైంది. మ్యాచ్ ను యువరాజ్ సింగ్(23 నాటౌట్;25 బంతుల్లో 1ఫోర్, 1 సిక్స్) సిక్సర్ తో మ్యాచ్ ను ముగించడం విశేషం. మరొకవైపు గట్టి పోటీ ఇస్తుందనుకున్న దక్షిణాఫ్రికా పూర్తిగా వైఫల్యం చెంది టోర్నీ నుంచి భారంగా నిష్క్రమించింది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది.
 
ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది.  ఓపెనర్లు డీకాక్-ఆమ్లాలు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఆదిలో ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం వచ్చిన తరువాత ఆమ్లా పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్ కు జత కలిసిన డు ప్లెసిస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 116 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. 
 
అటు తరువాత డివిలియర్స్(16), మిల్లర్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. స్కోరును పెంచే క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్  కుమార్, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా,అశ్విన్, పాండ్యా, రవీంద్ర జడేజాలు వికెట్ చొప్పున తీశారు.
 
శిఖర్ ధావన్ 78, కోహ్లీ 76 పరుగులతో రాణించారు. 8 ఓవర్లు బౌలింగ్ వేసి 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన జాస్ప్రిత్ బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ సెమీస్‌కు చేరగా సఫారీల జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. రన్‌రేట్‌లో పెద్ద మార్పులు లేకపోతే కోహ్లీ సేన సెమీస్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. సోమవారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఇంగ్లండ్‌‌తో తలపడనుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాంపియన్స్ ట్రోఫీ : ఇంగ్లండ్‌ హ్యాట్రిక్‌ విక్టరీ... ఆస్ట్రేలియా అవుట్‌