Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్యాట్స్‌మన్ ఉతికేశారు.. బౌలర్లు కుమ్మేశారు. పాక్‌పై టీమిండియా ఘనవిజయం

భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య ఇంత చప్పగా ముగిసిన పోటీ ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ పోటీయే అని చెప్పవచ్చు. ఏకపక్షం అనే మాటను అర్థం లేనిదిగా మారుస్తూ పాక్ తన దాయాది భారత్‌కు అప్పనంగా గెలుపును ధారపోసింది. పోటీ అనేదే లేకుండా ప్

బ్యాట్స్‌మన్ ఉతికేశారు.. బౌలర్లు కుమ్మేశారు. పాక్‌పై టీమిండియా ఘనవిజయం
హైదరాబాద్ , సోమవారం, 5 జూన్ 2017 (03:26 IST)
భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య ఇంత చప్పగా ముగిసిన పోటీ ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ పోటీయే అని చెప్పవచ్చు. ఏకపక్షం అనే మాటను అర్థం లేనిదిగా మారుస్తూ పాక్ తన దాయాది భారత్‌కు అప్పనంగా గెలుపును ధారపోసింది. పోటీ అనేదే లేకుండా ప్రత్యర్థిని అలా కుమ్మేస్తే రేపు రేపు జనాల ఆసక్తి కూడా చచ్చిపోయే ప్రమాదం ఉందనేంత బీభత్సంగా భారత్ గెలిచేసింది. పాక్ జట్టు ఇంత బలహీనంగా ఉండటం, విజయం పట్ల ఇంత నిరాసక్తత ప్రదర్శించడం ఇదే మొదటిసారి. పాక్ అభిమానులు కూడా  దిమ్మెరపోయేంత చెత్తగా 
ఆడిన పాక్ జట్టు విజయాన్ని అప్పనంగా భారత్‌కి అప్పగించేసింది. 
 
తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సునాయాస విజయంతో డిఫెండింగ్‌ టీమ్‌ తమ పదును చూపించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన వన్డేలో భారత్‌ 124 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (119 బంతుల్లో 91; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (68 బంతుల్లో 81 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్‌ ధావన్‌ (65 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్‌), యువరాజ్‌ సింగ్‌ (32 బంతుల్లో 53; 8 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. చివరి 4 ఓవర్లలో భారత్‌ ఏకంగా 72 పరుగులు కొల్లగొట్టడం విశేషం. 
 
వర్షంతో అంతరాయం కలిగిన కారణంగా పాకిస్తాన్‌ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్‌ 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది.  భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌ ఏ దశలోనూ దూకుడు కనబర్చలేకపోయింది. ఓపెనర్‌ షహజాద్‌ (12), బాబర్‌ ఆజం (8) ఏ మాత్రం ప్రభావం చూపించకుండానే వెనుదిరిగారు. భారత పేసర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం దక్కలేదు. తొలి 15 ఓవర్లలో (90 బంతుల్లో) పరుగులు రాని బంతులు (డాట్‌ బాల్స్‌) ఏకంగా 56 ఉండటం మన బౌలింగ్‌ సత్తాను, పాక్‌ ఘోర వైఫల్యాన్ని చూపిస్తోంది. ఆ తర్వాత కూడా పాక్‌ పుంజుకోలేదు.  ఉమేశ్‌ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి.
 
పాక్‌ ముందు 250కి పైగా లక్ష్యాలు నిలిచిన గత 13 సందర్భాల్లో ఆ జట్టు నెగ్గింది ఒకేసారి. ఛేదన అనగానే ఒత్తిడికి గురయ్యే పాక్‌ ముందు 48 ఓవర్లలో 324 పరుగుల (సవరించిన) లక్ష్యం నిలవడంతో ఆ జట్టు గెలుపు కష్టమని ముందే తేలిపోయింది. ఐతే పాక్‌ ఆటగాళ్లు పోరాడి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తారేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. 4.5 ఓవర్లలో పాక్‌ 22/0తో ఉండగా వర్షం పడటంతో.. లక్ష్యం 41 ఓవర్లలో 289గా మారింది. భువనేశ్వర్‌ (1/23) తొమ్మిదో ఓవర్లో షెజాద్‌ (12)ను ఔట్‌ చేసి పాక్‌ పతనానికి తెరతీశాడు. అప్పటికి స్కోరు 47 పరుగులే. ఆ తర్వాత వికెట్లూ నిలవలేదు, పరుగులూ పెద్దగా రాలేదు. 
 
భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 8న శ్రీలంకతో ఆడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యువరాజ్ అందుకు అవసరం.. పాండ్యా ఇందుకు అవసరం