ఢిల్లీ ఫిరోజ్‌షా కోట్ల మైదానం గురువారం పరుగుల వర్షంతో తడిసి ముద్దైంది. ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మూడో టెస్ట్‌లో ఓపెనర్ గంభీర్ (206) డబుల్ సెంచరీతో భారీ స్కోరుకు పునాది వేస్తే వీవీఎస్ లక్ష్మణ్ (200 నాటౌట్) సైతం డబుల్ సెంచరీతో తన సత్తా నిరూపించాడు.
కెరీర్లో రెండో టెస్ట్ డబుల్ సెంచరీ సాధించిన లక్ష్మణ్ ఆ రెండూ కూడూ ఆస్ట్రేలియాపైనే సాధించడం గమనార్హం. లక్ష్మణ్ డబుల్ సెంచరీ సాధించడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్ల నష్టానికి 613 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్ డిక్లెర్ చేసే సమయానికి లక్ష్మణ్‌తో పాటు జహీర్ (28 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గంభీర్, లక్ష్మణ్ తర్వాత సచిన్ (68), కుంబ్లే (45)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ మూడు వికెట్లు సాధించగా వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. వీరితోపాటు బ్రెట్‌లీ, కటిచ్‌లు చెరో వికెట్ సాధించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. హెడెన్, కటిచ్‌లు ఓపెనర్లుగా బరిలో ఉన్నారు.
ఓవర్‌నైట్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 296 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు గంభీర్, లక్ష్మణ్‌లు మరోసారి శుభారంభాన్నిచ్చారు. తద్వారా భారత్ భారీ స్కోరు సాధించేందుకు వీరిద్దరు తమ వంతు సాయం చేశారు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆస్ట్రేలియా కెప్టెన్ పాంటింగ్ చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి.
జోరుగా సాగుతున్న వీరిద్దరి భాగస్వామ్యానికి వాట్సన్ ఎట్టకేలకు తెరదించాడు. గంభీర్‌ను వాట్సన్ ఔట్ చేయడంతో భారత్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. గంభీర్ తర్వాత క్రీజులోకి వచ్చిన గంగూలీ (5), ధోనీ (27)లు త్వరగానే నిష్క్రమించారు. వీరిద్దరి తర్వాత వచ్చిన కెప్టెన్ కుంబ్లే, జహీర్‌ఖాన్‌ల భాగస్వామ్యంతో లక్ష్మణ్ డబుల్ సెంచరీ పూర్తి చేశాడు.
అంతకుముందు ఈ టెస్ట్‌లో తొలిరోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (1) నిరాశపర్చడంతో పాటు ద్రావిడ్ (11) సైతం తక్కువ పరుగులకే వెనుతిరిగాడు. ఈ దశలో సచిన్ (68) గంభీర్‌తో కలిసి మూడో వికెట్‌కు 130 పరుగులు జత చేయడం ద్వారా భారత ఇన్నింగ్స్‌ను కుదుటపరిచాడు. అనంతరం గంభీర్‌కు జత కల్సిన లక్ష్మణ్ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు.