ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించటంతో 1983 తర్వాత ప్రపంచ కప్ విజేత కాలేకపోయిన ఇండియా.. స్వదేశీ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్‌లో ఆ స్వప్న సాకారానికి చేరువలోకి వచ్చింది. అజేయంగా సాగుతున్న ఆస్ట్రేలియా ఆధిపత్యానికి గండి కొట్టిన భారత్... పాక్ కెప్టెన్ ఆఫ్రిది జోస్యం చెప్పినట్టే సెమీఫైనల్‌లో దాయాదితో ఈ నెల 30వ తేదీన మొహాలీలో తలపడనుంది.
భారత్‌కు అచ్చొచ్చిన ఈ మైదానంలో ఫైనల్ చేరికకు ఇరుజట్లు ఢీకొనబోతున్నాయి. నిన్నటి ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత జట్టు అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించింది. టాస్ కీలకమైన మ్యాచ్‌లో టాస్ ఓడినప్పటికీ మంచి పోరాటపటిమను ప్రదర్శించింది. లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం వెస్టీండీస్‌తో మాత్రమే తుది జట్టులో స్థానం సంపాదించిన అశ్విన్, సురేష్ రైనాలు ఆస్టేలియాతో మ్యాచ్‌లో కూడా వెస్టిండీస్ మ్యాచ్ మాదిరిగానే బౌలింగ్, బ్యాటింగ్‌లలో రాణించారు.
ముఖ్యంగా కొత్త బంతిని పంచుకున్న అశ్విన్.. సీనియర్ బౌలర్ జహీర్ ఖాన్‌తో కలిసి ఆస్ట్రేలియాను కట్టడి చేశాడు. ఓ అద్భుత బంతితో ప్రమాదకరమైన షేన్‌వాట్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వెస్డిండీస్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనే తన ప్రతిభ చాటిన అశ్విన్ ఈ మ్యాచ్‌లో చక్కగా బౌలింగ్ చేశాడు. అశ్విన్, జహీర్ ఖాన్, యువరాజ్‌లతో పాటు గత కొంత కాలంగా తన స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోతున్న భారత జట్టు ప్రధాన స్పిన్నర్ హర్భజన్ కూడా మెరుగ్గా రాణించి అసీస్ బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించటంలో సఫలీకృతులయ్యారు.
ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఒకటివుంది. అదే భారత జట్టు ఫీల్డింగ్. నిన్నటి మ్యాచ్‌లో మునాఫ్ మినహా ప్రతి ఒక్కరు అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. ఫీల్డింగ్, బౌలింగ్‌లలో రాణించటంతో పాటు కెప్టెన్ ధోని బౌలర్లను వినియోగించిన తీరు ఆస్ట్రేలియాను 260 పరుగులకే కట్టడి చేయటంలో కీలకంగా చెప్పవచ్చు. రికీ పాంటింగ్ విఫలమై వుంటే ఇంకా తక్కువ పరుగులే చేసివుండేది.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో 260 పరుగుల ఛేధించటం అంత సులభతరం కానప్పటికీ భారత బ్యాట్స్‌మెన్ తొలి నుంచి ఆశావహ దృక్పధంతో పాటు పోరాట పటిమను చూపారు. తొలుత సచిన్, గౌతమ్ గంభీర్‌లు ఇన్నింగ్‌కు గట్టి పునాదులు నిర్మించారు. అయితే మధ్యలో కొంత తడబడినప్పటికీ యువరాజ్, రైనా పోరాటంతో విజయకేతనం ఎగురవేశారు. ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో మెరుగ్గా రాణించారు. ఆస్ట్రేలియా వంటి అజేయ జట్టును ఇంటి ముఖం పట్టించటంతో భారత జట్టు సభ్యులందరిలో విశ్వాసం రెట్టింపై తదుపరి మ్యాచ్‌లకు టానిక్‌గా పనిచేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
పాకిస్థాన్ కూడా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన తీరును చూసిన తర్వాత మానసికంగానే ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా సెమీ ఫైనల్ పాకిస్థాన్‌పై భారత్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అన్ని రంగాల్లో ఇదే విధంగా రాణిస్తే విజయం మనదే. కప్ కైవసానికి మరో రెండు మెట్లు మాత్రమే ఎక్కాల్సివుంది. సో గో అహెడ్ ఇండియా ! ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా.